పులివెందుల: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య తర్వాత సాక్ష్యాలను తారుమారు చేసిన ఆరోపణలపై జైలులో శిక్షను అనుభవిస్తున్న ముగ్గురు నిందితులు ఇచ్చిన వాంగ్మూలాన్ని సిట్ బృందం కోర్టుకు సమర్పించింది.

ఈ ఏడాది మార్చి 14వ తేదీ రాత్రి వివేకానందరెడ్డి హత్యకు గురయ్యాడు. ఈ హత్య తర్వాత సాక్ష్యాలను తారుమారు చేశారని వివేకానందరెడ్డి అనుచరుడు గంగిరెడ్డి, పీఏ కృష్ణారెడ్డి, వంట మనిషి కొడుకు ప్రకాష్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ ముగ్గురు నిందితులను సోమవారం నాడు పులివెందుల కోర్టులో హాజరుపర్చడంతో ఈ నెల 22 వరకు నిందితులకు రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. నాలుగు రోజుల పాటు ఈ ముగ్గురిని సిట్ బృందం తమ కస్టడీకి తీసుకొన్నారు. అయితే పోలీస్ కస్టడీ ముగియడంతో ఈ ముగ్గురిని సోమవారం నాడు కోర్టులో హాజరుపర్చారు.

వివేకానందరెడ్డి ముఖ్య అనుచరుడిగా ఆయనను తరచూ కలుస్తుంటానని గంగిరెడ్డి విచారణలో చెప్పినట్టు తెలుస్తోంది. గత నెల 15 వ తేదీ ఉదయం 7 గంటలకు వివేకానందరెడ్డి బావమరిది తనకు ఫోన్ చేసి వివేకానందరెడ్డి చనిపోయారని చెప్పారని సిట్ బృందానికి వివరించినట్టుగా సమాచారం. తాను వివేకా ఇంటికి వెళ్లగానే  ఆయన ఇంటి వద్ద జనం ఉన్నారని ఆయన గుర్తు చేసుకొన్నారు. బెడ్రూమ్‌లో వివేకానందరెడ్డి రక్తపు మడుగులో పడి ఉన్నారని గంగిరెడ్డి పోలీసులకు చెప్పినట్టుగా తెలుస్తోంది.

మార్చి 15వ తేదీ ఉదయం ఐదున్నర గంటలకు తాను  వివేకా ఇంటికి వెళ్లినట్టుగా పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పారు.  ఆ తర్వాత సౌభాగ్యమ్మకు ఫోన్ చేసి వివేకా లేవలేదని చెప్పినట్టుగా వివరించారు. 

ఆ తర్వాత వంట మనిషి లక్ష్మీదేవి ఆమె కొడుకు ప్రకాష్‌లు  వచ్చిన తర్వాత  ఎన్ని సార్లు పిలిచినా ఆయన పలకకపోవడంతో వాచ్‌మెన్ రంగన్న సైడ్ డోర్ తీసి చూస్తే వివేకానందరెడ్డి రక్తపు మడుగులో పడి ఉన్నాడని పోలీసులకు చెప్పారు.సోఫా వద్ద వివేకానందరెడ్డి చేతి రాతతో ఉన్న లెటర్‌ను తీసుకొని వివేకా కూతురు , అల్లుడికి ఇచ్చినట్టుగా ఆయన చెప్పారు. ఇంత కంటే తనకు ఏ విషయాలు తెలియవన్నారు. 

పీఏ కృష్ణారెడ్డితో కలిసి వివేకానందరెడ్డి పలకడం లేదని భావించి ఇంట్లోకి వెళ్లి చూసినట్టుగా ప్రకాష్ పోలీసులకు చెప్పాడు. ఓ కాగితం పడి ఉంటే ఆ కాగితాన్ని తాను పీఏ కృష్ణారెడ్డికి ఇచ్చినట్టు వివరించారు. ఆ లెటర్‌ను భద్రపర్చాలని ఆయన తనకు సూచించారని ఆయన తెలిపారని సమాచారం.

సంబంధిత వార్తలు

వైఎస్ వివేకా హత్య : నిందితుల రిమాండ్ పొడిగింపు