గుంటూరు జిల్లా వరుస అత్యాచారాలతో వణికిపోతోంది.. గురజాల, పాత గుంటూరు ఘటనలతో జిల్లాలో ఆడపిల్లల రక్షణ పట్ట తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా మరో యువతి అత్యాచారానికి గురైంది.. తాడేపల్లి మండలం పోలకంపాడుకు చెందిన యువతి గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. శుక్రవారం రాత్రి తన విధులు ముగించుకుని తన స్నేహితుడితో కలిసి మంగళగిరి సమీపంలో ఉన్న కోకోకోలా కంపెనీ సమీపానికి వెళ్లింది.

ఆ సమయంలో వారిని వెంబడించిన గుర్తు తెలియని వ్యక్తులు స్నేహితుడిని బెదిరించి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.. అంతటితో ఆగకుండా గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లి రాత్రాంతా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం తెల్లవారుజామున యువతిని వదిలిపెట్టారు..

ఈ దారుణాన్ని ఆమె తన తల్లిదండ్రులకు చెప్పడంతో.. వారు పోలీసులకు సమాచారం అందించి.. చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.. ఇది తెలిసిన వ్యక్తుల పనా.. లేకపోతే దుండగుల పనా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.