ఓ వ్యక్తిని అతి దారుణంగా కొట్టారు. ఆ తర్వాత కత్తితో పొడిచారు. మళ్లీ వచ్చి చితకబాదారు. ఆ తర్వాత ముఖం  చూసి.. అయ్యో.. సారీ బ్రదర్.. మేము కొట్టాల్సింది నిన్ను కాదు అంటూ నాలుక కరుచుకున్నారు. ఆ తర్వాత  చేతిలో రూ. వెయ్యి పెట్టి చికిత్స చేయించుకోమని చెప్పి వెళ్లిపోయారు. ఈ సంఘటన గుంటూరు నగర శివారులో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చుక్కపల్లివారిపాలెంకు చెందిన పల్లం ఏసుదాసు కుమారుడు తేజ(18) అమరావతిలోని వాళ్ల చిన్నమ్మ ఇంట్లో ఉంటూ ఆర్ వీవీఎన్ కళాశాలలో బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. చర్చి ప్రతిష్టాపన ఉండగా.. వారి తల్లిదండ్రులు శనివారం ఉదయం అమరావతికి వచ్చారు. కార్యక్రమం పూర్తి కాగానే.. తల్లిదండ్రులను అక్కడి నుంచి కారులో దింపేసి.. తేజ అమరావతి బయలుదేరాడు.

ఈ క్రమంలో స్థానిక గోరంట్ల ఇన్నర్ రింగ్ రోడ్డు వద్దకు రాగానే తేజ కారు పంక్చరైంది. దానిని పరిశీలిస్తుండగా.. కొందరు వ్యక్తి తేజను దారుణంగా చితకబాదారు. మమ్మల్ని గుద్దేసి పారిపోతావా అంటూ కొట్టారు. అనంతరం కత్తితో పొడిచారు. పది నిమిషాల తర్వాత మరో ఇద్దరు యువకులు వచ్చి కర్రలతో కొట్టి వెళ్లారు.

కొంత సేపు ఆగిన తర్వాత వారు ముగ్గురు తేజ దగ్గరకు వచ్చి.. సారీ బ్రదర్.. నిన్ను కాదు.. వేరేవాడిని కొట్టాల్సిందిపోయి.. నిన్ను కొట్టాం అని చెప్పి. ట్రీట్మెంట్ కి ఈ డబ్బులు ఉంచుకో అంటూ రూ. వెయ్యి చేతిలో పెట్టి అక్కడి నుంచి పారిపోయారు. కాగా.. తీవ్రగాయాలతోనే తేజ సమీపంలోని ఆస్పత్రికి చేరుకొని వైద్యం చేయించుకుంటున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.