Asianet News TeluguAsianet News Telugu

జగన్ రాజీ చేసినా కుదరని సయోధ్య: వల్లభనేని వంశీకి నిరసన సెగ

సీఎం వైఎస్ జగన్ స్వయంగా పూనుకుని ప్రయత్నించినా గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ వర్గాల మధ్య సయోధ్య కుదరలేదు. తాజాగా, ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి నిరసన సెగ ఎదురైంది.

Gananvaram MLA Vallabhaneni Vamsi faces opposition from other leaders in Gannavaram
Author
Gannavaram, First Published Nov 17, 2020, 7:46 AM IST

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాజీ చేసినప్పటికీ గన్నవరం శాసనసభ నియోజకవర్గం పార్టీ నేతల మధ్య సయోధ్య కుదరదలేదు. తాజాగా, గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి నిరసన సెగ ఎదురైంది. వైసీపీలోని విభేదాలు మరోసారి రోడ్డుకెక్కాయి. 

వల్లభనేని వంశీని ఓ వైపు దుట్టా రామచంద్రరావు, మరోవైపు యార్లగడ్డ వెంకటరావు వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం బావులపాడు మండల పరిషత్తు కార్యాలయం వద్ద వైసీపీ నాయకులు, కార్యకర్తలకు ఆందోళనకు దిగారు. 

వీరవల్లి సచివాలయ భవన నిర్మాణాల పనుల కేటాయింపులో తమకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ దుట్టా, యార్లగడ్డ వర్గాలకు చెందిన నాయకులు ధర్నా చేశారు. నిర్మాణ పనుల బాధ్యతను తొలుత తమకే అప్పగించారని, వంశీ కూడా తమతోనే పూజలు చేయించారని, చివరకు వేరేవాళ్లకు అప్పగించారని ఆరోపిస్తూ సూరపనేని రాధాకృష్ణమూర్తి, వెలగపూడి శేషగిరి రావు, కాలి రమేష్, వైవీ రంగారావు తదితరులు ఆరోపించారు. 

వంశీ తమను వేధిస్తున్నారని ఆరోపిస్తూ వంశీ డౌన్ డౌన్ అని నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. వైవీ సుబ్బారెడ్డికి విషయం చెప్పినా తమకు న్యాయం జరగలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వంశీ వైసీపీలోకి రావడంతో పదేళ్ల పాటు శ్రమించిన తమకు అన్యాయం జరుగుతోందని, ఈ విషయాన్ని జగన్ గమనించాలని వారన్నారు. వ్యవహారం తేలేవరకు పనులు ఆపేయాలని వారు ఎంపీడీవో కేశవ రెడ్డిని డిమాండ్ చేశారు. 

ఆ అధికారం తనకు లేదని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్తానని ఆయన చెప్పారు. ఆ తర్వాత తహసీల్దార్ కార్యాలయం వద్ద ఇదే అంశంపై కాసేపు ధర్నా నిర్వహించారు. అయితే, కాకులపాడు సచివాలయ నిర్మాణ పనులను మొదటి నుంచీ పార్టీలో ఉన్నవారికే అప్పగించారని వంశీ వర్గానికి చెందినవారంటున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios