ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతుందని తాను ఊహించలేకపోయానని ఆ పార్టీ మహిళా నేత గల్లా అరుణ కుమారి అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోరపరాజయం చవి చూడగా... వైసీసీ అనూహ్య మెజార్టీతో విజయం సాధించింది. కాగా... ఈ ఘటనపై తొలిసారి గల్లా అరుణ స్పందించారు.

మంగళవారం ఆమె తెనాలి గంగానమ్మ తల్లి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తన కుమారుడు గల్లా జయదేవ్ ఎంపీగా గెలిచినందుకు గాను... మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... టీడీపీ అధినేత చంద్రబాబు, గల్లా జయదేవ్‌తో పాటు టీడీపీ భారీ సీట్లు దక్కించుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గతంలో గంగానమ్మను కోరినట్లు తెలిపారు. కానీ.. విచిత్రంగా తీర్పు వచ్చిందని వ్యాఖ్యానించారు.
 
ఎవరు గెలిచినా ప్రజల అవసరాలు తీర్చేవిధంగా పరిపాలించాలిని.. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు గల్లా అరుణకుమారి తెలిపారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనకు కొంత సమయం ఇస్తే ప్రజలే సరైన తీర్పు ఇస్తారన్నారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచిస్తారన్నారు. టీడీపీ కార్యకర్తలపై దాడులు చెయ్యటం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని గల్లా చెప్పుకొచ్చారు. టీడీపీలో ఒక్క కార్యకర్తపై దాడి జరిగిన అందరం కలిసి పోరాడతామని.. కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలబడుతుందని గల్లా అరుణ తెలిపారు.