అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నివాసం వద్ద కోలాహాలం నెలకొంది. ముఖ్యమంత్రిగా మరికొన్ని గంటల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న తరుణంలో జగన్ ఇంటివద్ద సందడి నెలకొంది. 

జగన్ కు శుభాకాంక్షలు తెలిపేందుకు, అలాగే ప్రమాణ స్వీకారానికి తరలివెళ్లేందుకు బంధువులు తరలివస్తున్నారు. ఇకపోతే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, వైయస్ జగన్ చిన్నాన్న మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డిలు తాడేపల్లిలోని జగన్ నివాసానికి చేరుకున్నారు. 

జగన్ కుటుంబ సభ్యులు, కీలకమైన నేతలతో కలిసి తన నివాసం నుంచి ప్రమాణ స్వీకారానికి ఇందిరాగాంధీ స్టేడియం వద్దకు వెళ్తారని తెలుస్తోంది. ఉదయం 11.20 గంటలకు శుభముహూర్తాన వైయస్ జగన్ కుటుంబ సభ్యులతో కలిసి తాడేపల్లిలోని ఆయన నివాసం నుంచి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్దకు చేరుకోనున్నారు. 

వైయస్ జగన్ 12.09 గంటలకు స్టేడియం వద్దకు చేరుకుంటారు. అనంతరం 12.23 గంటలకు వైయస్ జగన్ ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వైయస్ జగన్ తో ముఖ్యమంత్రిగా తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు.