గందరగోళంలో ఆనం బ్రదర్స్

First Published 17, Jan 2018, 10:23 AM IST
Full confusion in Anam brothers over their political future
Highlights
  • నెల్లూరు జిల్లా టిడిపిలో ఆనం బ్రదర్స్ ఒంటరైపోయారు.  

నెల్లూరు జిల్లా టిడిపిలో ఆనం బ్రదర్స్ ఒంటరైపోయారు.  ఆనం బ్రదర్స్ కేంద్రంగా జరుగుతున్న కొత్త రాజకీయం ఆశక్తికరంగా మారింది. టిడిపిలో చేరిందగ్గర నుండి బ్రదర్స్ కు అవమానాలే జరుగుతున్నాయి. అయినా సహించి భరిస్తున్నారు. ఎందుకంటే, వారికి మరోదారి లేదు కాబట్టి. కాంగ్రెస్ లో ఉండలేక, భవిష్యత్తుపై ఆందోళనతోనే బ్రదర్స్ టిడిపిలో చేరారన్నది వాస్తవం. అందులోనూ వారికి వైసిపిలో గేట్లు మూసుకుపోయాయి. దాంతో వారికి టిడిపి మాత్రమే దిక్కైంది.

ఎప్పుడైతే వారు పార్టీలో చేరారో పాత గొడవలను టిడిపి నేతలు తవ్వి తీస్తున్నారు. ఎందుకంటే, రాష్ట్ర విభజన ముందు ఆనం బ్రదర్స్ పదేళ్ళ పాటు జిల్లాలో ఓ రేంజిలో చక్రం తిప్పారు. ఎప్పటికీ తామే అధికారంలో ఉంటామన్న ఉద్దేశ్యంతో టిడిపి నేతలందరినీ ఓ తొక్కుతొక్కారు. రాష్ట్ర విభజనతో వారికి కష్టాలు మొదలయ్యాయి. ఇష్టం ఉన్న లేకపోయినా వేరే దారిలేదు కాబట్టి బ్రదర్స్ టిడిపిలో చేరారు.

వారిని పార్టీలో చేర్చుకోవటాన్ని టిడిపిలోని నేతలందరూ పూర్తిగా వ్యతిరేకించారు. అయినా చంద్రబాబు నిర్ణయాన్ని కాదనలేక అందరూ మౌనంగా ఉండిపోయారు. దాంతో అనుచరులతో కలిసి సోదరులిద్దరూ భారీ ఎత్తున టిడిపిలో చేరారు. ఎప్పుడైతే సోదరులు టిడిపిలో చేరారో అప్పటి నుండి సొంతంగా వర్గాలను ఏర్పాటు చేసుకోవాటానికి ప్రయత్నించారు. అయితే, పాత అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న టిడిపి నేతలెవరూ వారితో కలవటానికి ఇష్టపడలేదు.

ఎప్పుడైతే ఆనం సోదరులు టిడిపిలో చేరారో అప్పటి నుండి వారిని వేధించటం మొదలుపెట్టారు. వేధింపులంటే మరేంలేదు. వారిని పార్టీ కార్యక్రమాలకు పిలవటం లేదు. వారికి ఎటువంటి పనులు కానీయటం లేదు. ఒకవేళ వారంతట వారుగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నా వారిని ఎవరూ కలుపుకుని పోవటం లేదు. ఆనం రామనారాయణరెడ్డి పేరుకు మాత్రమే ఆత్మకూరు నియోజకవర్గ ఇన్చార్జి. నియోజకవర్గంలోని నేతలు కూడా ఆనంను పట్టించుకోవటం లేదు.

పార్టీలో జరుగుతున్న పరిణామాలను చంద్రబాబుకు సోదరులు ఫిర్యాదు చేసారు. అయినా నేతల్లో ఎటువంటి మార్పు కనబడలేదు. దాంతో ఏం చేయాలో తెలీక తమలో తామే ఇపుడు కుమిలిపోతున్నారు. ఈ నేపధ్యంలోనే ఆనం వివేకానందరరెడ్డి ఆరోగ్యం దెబ్బతినటంతో చాలాకాలంగా దాదాపు ఇంటికే పరిమితమైపోయారు. రామనారాయణరెడ్డి మాత్రం జిల్లాలో ఒంటిరిగా తిరుగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పరిస్దితి ఏమిటో వారికే అర్ధం కాక గందరగోళంలో పడిపోయారు.   

 

loader