Asianet News TeluguAsianet News Telugu

సమాజానికి సవాల్

సినిమాల ప్రభావం, చుట్టుపక్కల ప్రభావం కారణాలు ఏదైనా గానీ పెడదోవపడుతున్నది మాత్రం యువతేనన్నది స్పష్టం.

Freshers push crime rate up in ap

యువతలో కొందరు సమాజానికి సవాలుగా మారుతున్నారు. నేరప్రవృత్తిలోకి అడుగుపెట్టటం ద్వారా ఇటు కుటుంబానికి అటు సమాజానికి ప్రమాదకరంగా తయారౌతున్నారు. గడచిన రెండు సంవత్సరాల గణాంకాలు చూస్తూనే ఈ విషయాలు ఆందోళనకరంగా ఉంటున్నాయి. చక్కగా చదువుకుని కుటుంబంలో, సమాజంలో మంచిపేరు తెచ్చుకోవాల్సిన యవతలో నేరపరవృత్తి పెరుగిపోతుండటం ఎంతమాత్రం ఉపేక్షించేందుకు లేదు. సినిమాల ప్రభావం, చుట్టుపక్కల ప్రభావం కారణాలు ఏదైనా గానీ పెడదోవపడుతున్నది మాత్రం యువతేనన్నది స్పష్టం.

 

మారిన సామాజిక పరిస్ధితుల వల్ల ఉన్నత చదువులు, ఉద్యోగ, ఉపాధి కోసం పలువురు యువత తల్లి, దండ్రులకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో సావాసదోషాల కారణంగానో లేక అవసరాల కోసం కూడా కావచ్చు పలువురు యువత ఈజీ మనీపై దృష్టి పెడుతున్నారు. కష్టపడకుండా డబ్బు సంపాదించటమే ఈజీ మనీ. ఎలాగంటే, దొంగతనాలు, నేరగాళ్ళతో చేతులు కలపటం, వాహనాల దొంగతనాలు, చైన్ స్నాచింగ్ లాంటి చోరీలకూ పాల్పడటం ద్వారా డబ్బు సంపాదనకు అలవాటుపడుతున్నారు.

 

దొంగతనాలు జరిగినపుడు ఇటువంటి వారిని పట్టుకోవటం కూడా పోలీసులకు తలకుమించిన పనే అవుతోంది. ఎందుకంటే కొత్తగా వృత్తిలోకి అడుగుపెడుతున్న కారణంగా వీరి వివరాలేవీ పోలీసు రికార్డుల్లో ఉండవు. కాబట్టి మొదట్లో బాగానే ఉంటుంది. ఎక్కడైనా సిసి కెమెరాల్లో చిక్కినపుడు మాత్రమే ఇటువంటి వారిని పోలీసులు గుర్తించగులుగుతున్నారు. పట్టుకోవటం కొంచెం కష్టమే అయినా ఏదో ఒక రోజు దొరక్క తప్పదు. ఆశ్చర్యమేమిటంటే పట్టుబడుతున్న వారిలో ఉన్నత కుటుంబాలకు చెందిన వారూ ఉండటమే. ఇంజనీరింగ్, ఎంబిఏ చదువుతున్న యువత కూడా నేరసామ్రాజ్యంలోకి అడుగుపెడుతుండటం ఖచ్చితంగా ఆందోళనకరమే.                                                                                            

 

పిల్లలు నేరాలు చేసి పట్టుబడుతుండటంతో ఆయా కుటుంబాల్లో కల్లోలమే రేగుతోంది. 2015 సంవత్సరంలో వివిధ నేరాల్లో 18 ఏళ్ళలోపు యువత 1371 మంది పట్టుబడ్డారు. వీరంతా కొత్తగా నేరాల్లోకి దిగినవారే. పైగా వీరిలో సుమారు వెయ్యి మంది కుటుంబాలతో కలిసి ఉంటున్నవారే. పోలీసులకు చిక్కిన 18 ఏళ్ళలోపు నేరస్తుల్లో 25 మంది హత్యలు, అత్యాచారాల్లో ఇరుక్కోవటం పోలీసులనే ఆశ్చర్యపరిచింది. ఇటువంటి వారి విషయంలో ఒక్క ప్రభుత్వమే కాదు వివిధ రంగాల్లోని నిపుణులు కూడా చొరవ తీసుకుని యువతలో నేరప్రవృత్తి తగ్గేందుకు తమ వంతుగా సాయం చేయాల్సిన అవసరం ఉంది.