అమరావతి: ఏపీ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్  ప్రమాణస్వీకారం చేసిన వెంటనే  తన టీమ్‌ను నియమించుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న కాలంలో సీఎంఓగా ఉన్న ఐఎఎస్ అధికారులను బదిలీ చేశారు. వీరిని పోస్టింగ్ కోసం జీఏడీలో రిపోర్ట్ చేయాలని  ఏపీ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రగా ఉన్న కాలంలో  ముఖ్యమంత్రికి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న సతీష్ చంద్ర,  చీఫ్ మినిస్టర్‌కు ప్రిన్సిఫల్ సెక్రటరీగా జి. సాయిప్రసాద్,  చీఫ్ మినిస్టర్‌కు సెక్రటరీలుగా ఎం. గిరిజా శంకర్, వి. రాజమౌళి కొనసాగారు.

ఏపీ సీఎంగా జగన్ గురువారం నాడు ప్రమాణ స్వీకారం చేసిన రెండు గంటల్లోపుగానే ఈ నలుగురు ఐఎఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ నలుగురు అధికారులు. తదుపరి ఉత్తర్వుల కోసం జీఏడీలో రిపోర్టు చేయాలని ఉత్తర్వులు వెలువడ్డాయి.

ఇదిలా ఉంటే జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత సీఎంఓ అదనపు కార్యదర్శిగా సీనియర్ ఐఎఎస్ అధికారి ధనుంజయరెడ్డిని నియమించారు. ఈ మేరకు గురువారం నాడు ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రస్తుతం టూరిజం రాష్ట్ర కార్పోరేషన్ ఎండీగా ధనుంజయరెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

గతంలో  ఆయన వ్యవసాయశాఖలో పనిచేశారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన కాలం నుండి  ధనుంజయ రెడ్డి జగన్ క్యాంపు కార్యాలయంలో సేవలు అందిస్తున్నారు.