ఓటర్ల జాబితాలో అక్రమాలు.. బాపట్ల జిల్లాలో నలుగురు పోలీస్ అధికారులపై వేటు
బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో జోక్యం చేసుకున్న పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది . మార్టూరు సీఐ, పర్చూరు, యుద్ధనపూడి, మార్టూరుల ఎస్ఐలను సస్పెండ్ చేస్తూ మంగళవారం బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలు జారీ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇప్పటికే ఇరు పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కొన్ని చోట్ల ఈసీ యాక్షన్‌లోకి దిగి.. పలువురు అధికారులను సైతం సస్పెండ్ చేసింది. తాజాగా బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో జోక్యం చేసుకున్న పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. ఎన్నికల విధుల్లో పాల్గొన్న మహిళా పోలీసులపై వీరు నిబంధనలకు వ్యతిరేకంగా ఒత్తిడి తీసుకొచ్చి.. ఓట్ల తొలగింపు కోరుతూ వచ్చిన దరఖాస్తుల సమాచారాన్ని అధికార పార్టీకి చెందిన కొందరు నేతలకు సమర్పించారని ఈసీకి టీడీపీ ఫిర్యాదు చేసింది.
దీనిపై సీఈవో ముఖేష్ కుమార్ మీనా స్పందించారు. ఈ వ్యవహారంపై విచారణ జరపాల్సిందిగా బాపట్ల జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. దీనిపై విచారణ నిర్వహించిన కలెక్టర్.. బీఎల్‌వోలు పోలీస్ అధికారులకు సమాచారం పంపిన విషయం నిజమేనని నిర్ధారించుకుని, ఈ మేరకు ఈసీకి నివేదిక పంపారు. అయినప్పటికీ బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోకపోవడంపై పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు హైకోర్టును ఆశ్రయించారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న ధర్మాసనం .. బాధ్యులైన అధికారులపై ఏం చర్యలు తీసుకున్నారో తమకు సమర్పించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో మార్టూరు సీఐ, పర్చూరు, యుద్ధనపూడి, మార్టూరుల ఎస్ఐలను సస్పెండ్ చేస్తూ మంగళవారం బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలు జారీ చేశారు.