ఒకే కుటుంబంలో నలుగురు సభ్యులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాదకర సంఘటన విశాఖ నగరంలో చోటుచేసుకుంది. ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని ఓ లాడ్జిలో నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు.

ఆత్మహత్యకు పాల్పడిన వారిని పెందుర్తి శివారు బంధుపాలెంకు చెందిన బి. అప్పలరాజు కుటుంబంగా గుర్తించారు. అప్పల రాజు తన కుటుంబసభ్యులతో కలిసి ఇటీవల ఓ లాడ్జ్ లో గదిని అద్దెకు తీసుకున్నారు. గత కొంతకాలంగా వారు అప్పుల బాధతో అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో.. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకొని ఆ తర్వాత లాడ్జ్ కి వచ్చారు.

అక్కడ అప్పలరాజు భార్య మానస, కుమారుడు సాత్విక్(5), కుమార్తె కీర్తి(6)లకు ఉరి వేసి అనంతరం తాను కూడా  ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా.. అప్పుల బాధ తట్టుకోలేక తాము బలవన్మరణానికి  పాల్పడ్డామంటూ వారు సూసైడ్ నోట్ లో పేర్కొనడం గమనార్హం. అప్పలరాజు బంధువులు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.