Asianet News TeluguAsianet News Telugu

మచిలీపట్నంలో విషాదం... సముద్రంలో నలుగురు మత్స్యకారులు గల్లంతు

సముద్రంలో వేటకు వెళ్లి బోటు ఇంజన్ పాడవడంతో నడి సముద్రంలో నలుగురు మత్స్యకారులు చిక్కుకున్నారు. వీరికోసం తోటి మత్స్యకారుల గాలింపు కొనసాగుతోంది. 

Four fishermen missing at sea after boat Engine Trouble
Author
First Published Jul 5, 2022, 9:39 AM IST

మచిలీపట్నం : సముద్రంలో చేపలవేటకు వెళ్లి నలుగురు మత్స్యకారులు గల్లంతయిన దుర్ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. నాలుగురోజుల క్రితం సముద్రంలోకి వెళ్లినవారు తిరిగిరాకపోవడంతో ఏ ప్రమాదం జరిగిందోనని కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.

వివరాల్లోకి వెళితే... మచిలీపట్నం క్యాంబెల్ పేటకు చెందిన విశ్వనాథపల్లి చినమస్తాన్(55), రామాని నాంచార్లు(55), చెక్క నరసింహరావు (50), మోకా వెంకటేశ్వరరావు (35) మత్స్యకారులు. సముద్రంలో చేపలు పట్టి వాటిని విక్రయించి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఎప్పటిలాగే నాలుగురోజుల క్రితం ఈ నలుగురు చేపలవేటకు బోటులో సముద్రంలోకి వెళ్లారు. ప్రమాదవశాత్తు వీరు సముద్రంలోనే చిక్కుకుని గల్లంతయ్యారు.  

వేటకు వెళ్లిన బోటు ఇంజన్ పాడవడంతో సముద్రంలో ఎటూ కదల్లేని స్థితిలో వున్నట్లు వీరు కుటుంబసభ్యులకు ఫోన్ చేసి సమాచారమిచ్చారు. కానీ రెండురోజుల నుండి వీరిలో ఎవ్వరి ఫోన్లు కూడా పనిచేయడం లేదు.  దీంతో వీరు సముద్రంలో ఎక్కడ చిక్కుకున్నది తెలుసుకోవడం కష్టంగా మారింది.  

క్యాంబెల్ పేటకు చెందిన మత్స్యకారులు మరోబోటులో గల్లంతయినవారి ఆఛూకీ కనుక్కనేందుకు సముద్రంలోకి వెళ్లారు. అయినా ఇప్పటివరకు గల్లంతయిన వారి బోటు నిలిచిపోయిందో గుర్తించలేకపోయారు. సముద్రంలో మత్స్యకారుల కోసం గాలింపు కొనసాగుతోంది. 

నాలుగురోజులుగా సముద్రంలో చిక్కుకుపోయిన తమవారు ప్రాణాలతో ఉన్నారో...లేరో తెలియక బాధిత కుటుంబాలు తల్లడిల్లిపోతున్నారు. తమవారు క్షేమంగా తిరిగిరావాలని దేవుళ్లను ప్రార్థిస్తున్నారు. నేవీ సహకారంతో తమవారిని ఆఛూకీ కోసం గాలింపు చేపట్టాలని ప్రభుత్వ అధికారులను బాధిత కుటుంబం వేడుకుంటోంది. 

ఇటీవల ఇలాగే సముద్రంలో వేట నిషేదం వున్న సమయంలో అక్రమంగా చేపలుపట్టడానికి వెళ్లి జాలర్లు చిక్కుకున్నారు.  మత్స్య సంపదను రక్షించేందుకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 15 నుండి జూన్ 16 వరకు మత్స్యకారులు ఎవరు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని ఆంక్షలు ఉన్నాయి. కానీ మచిలీపట్నం గిలకలదిండి నుండి 8 మంది మత్స్యకారులు ఫైబర్ బోటు ద్వారా దొంగచాటుగా సముద్రం లోనికి వెళ్లారు.  

ఇదే సమయంలో ఆసనీ తుఫాను విరుచుకుపడటంతో జాలర్లు సముద్రంలో చిక్కుకున్నారు. దీంతో మత్స్యకారుల కుటుంబసభ్యులు తమవారిని కాపాడాలంటూ ప్రభుత్వాన్ని వేడుకున్నారు.  అప్ర‌మ‌త్త‌మైన అధికారులు వారి ఆచూకీ కోసం స‌ముద్రంలో జల్లెడ పట్టి 5 రోజులుగా స‌ముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులను సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. ఇలాగే తాజాగా సముద్రంలో చిక్కుకున్నవారిని కాపాడాలని మత్స్యకార కుటుంబాలు కోరుతున్నాయి. 

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios