తిరుమల  తిరుపతి వెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లారు. సంతోషంగా స్వామివారి దర్శనం చేసుకొని.. ఆనందంతో తిరిగి ఇంటికి వెళుతుండగా వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. వారి కారు లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న lనలుగురు వ్యక్తులు  ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా మార్టూరు సమీపంలోని జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. కాగా.. మృతులంతా పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వారు కావడం గమనార్హం.

మృతులు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన పర్వతనేని విజయలక్ష్మి, ఉయ్యూరు చినబాబు, కనక మహాలక్ష్మి, బలిజ సత్యన్నారాయణగా గుర్తించారు. వారంతా తిరుమల వెళ్లి తిరిగి వస్తుండగా ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో కారులో మొత్తం ఐదుగురు ప్రయాణిస్తుండగా నలుగురు మృతి చెందగా...ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వ్యక్తిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. లారీని ఢీకొట్టి ఇరుక్కుపోయిన కారును బయటకు తీసేందుకు యత్నిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.