విశాఖ జిల్లా భోగాపురం వద్ద నూతన విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు స్పందించారు. 

విశాఖ జిల్లా భోగాపురం వద్ద నూతన విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు స్పందించారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్మాణాలను ఒప్పందాలను నాడు కాదన్నారని.. కానీ నేడు అదే జీఎంఆర్ సంస్థకు ఇచ్చారని, ప్రభుత్వానికి ఇప్పటికి జ్ఞానోదయం అయ్యిందని ఆయన ధ్వజమెత్తారు.

ప్రయాణికులతో పాటు ఎయిర్‌క్రాఫ్ట్ మెయింట్‌నెన్స్ కార్గో సేవల కోసం భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను నాడు డిజైన్ చేశామని అశోక్ గుర్తుచేశారు. తాజాగా ఈ ప్రాజెక్ట్‌లో 500 ఎకరాలు తగ్గించారని ఆయన విమర్శించారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్మాణంలో కొత్త సవరణల కారణంగా అనేక ఉద్యోగాలు పోతాయని అశోక్ గజపతి రాజు ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read;భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి జీఎంఆర్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం

ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో జగన్ ప్రభుత్వం చిన్న పిల్లల ఆటలు ఆడుతోందని.. దీని వల్ల రాబోయే తరాలకు తీవ్ర నష్టం కలుగుతుందని అశోక్ అభిప్రాయపడ్డారు. ఉద్యోగావకాశాలు, అభివృద్ధి పెరగాలంటే, గతంలో డిజైన్ చేసిన ప్రాజెక్ట్‌ను కొనసాగించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

కాగా భోగాపురంలో ఎయిర్‌పోర్టు నిర్మాణంకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో జీఎంఆర్‌ సంస్థ ఒప్పందం కుదర్చుకుంది.శుక్రవారం నాడు సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి సమక్షంలో ప్రభుత్వం తరఫున అధికారులు, జీఎంఆర్‌ ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.

సీఎం ఆశించిన విధంగా చిరస్మరణీయ రీతిలో ఈ ఎయిర్‌పోర్టును నిర్మిస్తామని జీఎంఆర్‌ ప్రతినిధులు హామీ ఇచ్చారు. దీనికోసం ప్రముఖ అంతర్జాతీయ సంస్థల సేవలను వినియోగించుకుంటున్నామని జీఎంఆర్‌ ప్రతినిధులు సీఎం జగన్ కు చెప్పారు.

తాము పుట్టిన ప్రాంతంలో ఎయిర్‌పోర్టు నిర్మాణం చేపట్టడం తమ అదృష్టంగా భావిస్తున్నామని జీఎంఆర్ ప్రతినిదులు తెలిపారు. ఉత్తరాంధ్రప్రాంతానికి మంచి సదుపాయం వస్తుందని సీఎం వ్యాఖ్యానించారు.