రాజమండ్రి:ఏపీ పునర్విభజన చట్టం ప్రకారంగా పోలవరం ప్రాజెక్టును కేంద్రం చేపట్టాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు. ఇదే విషయమై కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరాలని ఆయన డిమాండ్ చేశారు. 

కాంగ్రెస్ నేత, రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గురువారం నాడు మీడియాతో మాట్లాడారు.  కానీ పోలవరం ప్రాజెక్టు ఇంకా నిర్మాణం పూర్తి కాలేదని ఆయన చెప్పారు. గత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిందే ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

also read:పోలవరంపై సీఎం ఎందుకు నోరు మెదపడం లేదు: దేవినేని

ఏపీ పునర్విభజన చట్టం ప్రకారంగా ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టాలన్నారు.పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఏం చేయాలో అన్నీ చేస్తామని బీజేపీ నేతలు చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పార్లమెంట్‌లో చట్టం చేశాక కేబినెట్ మీటింగ్ లో అంచనా వ్యయం తగ్గించడానికి వీల్లేదని చెప్పారు.

బీజేపీతో విడిపోవాలని తాము చెప్పడం లేదన్నారు. తనపై ఉన్న కేసుల గురించి జగన్ నోరెత్తడం లేదనే ప్రచారం సాగుతోందన్నారు.పోలవరం ప్రాజెక్టు వైఎస్ఆర్ మానస పుత్రిక అని ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్టుకు వైఎస్ఆర్ పేరు పెట్టాలని తాము డిమాండ్ చేశామని ఆయన గుర్తు చేశారు. 

రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర దాటింది.ఈ ప్రాజెక్టు విషయమై ఎందుకు నోరు మెదపడం లేదని ఆయన ప్రశ్నించారు.పోలవరం ప్రాజెక్టుకు ఈ పరిస్థితి వస్తోందనుకోలేదన్నారు. జరుగుతున్న ప్రతి తప్పును ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నామని ఆయన చెప్పారు.

రిజర్వాయర్ నిర్మించేందుకు పోలవరం అనువైన ప్రాంతమన్నారు. భూసేకరణ లేకుండా ప్రాజెక్టు నిర్మాణం జరగదని ఆయన తేల్చి చెప్పారు.పోలవరం ఖర్చును తామే భరిస్తామని విభజన చట్టంలో కేంద్రం పెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.పోలవరంపై కేంద్రాన్ని నిలదీసే ధైర్యం వైసీపీ లేదని ఆయన విమర్శించారు.