అమరావతి: పోలవరం ప్రాజెక్టు ఉనికి ప్రమాదంలో పడితే సీఎం ఎందుకు నోరు మెదపడం లేదని మాజీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ మహేశ్వరరావు ప్రశ్నించారు.

సోమవారం నాడు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే  పోలవరం ప్రాజెక్టు 71.02 శాతం పనులు పూర్తయ్యాయన్నారు.ఈ విషయాన్ని ఈ ప్రభుత్వం కూడ ఒప్పుకొందని ఆయన గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టు విషయంలో మంత్రి అనిల్ కుమార్ బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని ఆయన చెప్పారు.

also read:పోలవరం: ఢిల్లీకి వెళ్లాలని అధికారులకు జగన్ ఆదేశం, ఎందుకంటే?

పోలవరంం అంచనాలపై వైసీపీ చేసిన తప్పుడు ప్రచారం వల్లే నష్టం వాటిల్లిందని ఆయన అభిప్రాయపడ్డారు. 2017-18 రేట్ల ప్రకారం పోలవరం అంచనాలు రూ. 57, 297 కోట్లుగా ఆయన చెప్పారు. డీపీఆర్ 1 కంటే డీపీఆర్ 2 వల్లే ముంపు మరింత పెరిగిందన్నారు. అంతేకాదు పరిహారం కూడ ఎక్కువగా చెల్లించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు.

కేంద్రం అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెబితే  రూ. 55, 548 కోట్లకు కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు. 
రూ. 55, 548 కోట్లకు టెక్నికల్ కమిటీ కూడ ఈ విషయమై  ఆమోదం తెలిపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ విషయాన్ని 2019 జూన్ 24న కేంద్ర మంత్రి పార్లమెంట్ లో ప్రకటించిన విషయాన్ని ఆయన మీడియాకు వివరించారు.


సీపీఐ నారాయణ విమర్శలు

పోలవరం విషయంలో కేంద్రం చావు కబురు చల్లగా చెప్పిందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ విమర్శించారు. 
రాజకీయ చదరంగంలో పోలవరం నిమజ్జనానికి గురైందన్నారు. భూసేకరణ చేయకుండా ప్రాజెక్టులు ఎలా కడతారని ఆయన ప్రశ్నించారు.
భూ సేకరణ మా బాధ్యత కాదని కేంద్రం చేతులెత్తేసిందన్నారు. నిర్వాసితుల సమస్య పరిష్కారం కాకుండా ఎక్కడైనా ప్రాజెక్టు పూర్తవుతుందా చెప్పాల్సిందిగా ఆయన కోరారు.