రాజమండ్రి: తెలుగుదేశం పార్టీకీ ఆగష్టు నెల వస్తే ఏదో సంక్షోభవం వస్తుందని ఆనవాయితీగా కొనసాగుతుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సెంటిమెంట్ మారిపోయినట్లుంది అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆగష్టుపోయి ఇప్పుడు నవంబర్ సంక్షోభంగా మారిందంటూ ప్రచారం జరుగుతుంది. 

ఎందుకంటే నవంబర్ లో తెలుగుదేశం పార్టీని వీడేందుకు చాలా మంది నేతలు క్యూ కడుతున్నారట. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలవ్వడం వల్లనో లేక పార్టీలో భవిష్యత్ ఉండదనుకుంటున్నారో తెలియడం లేదు గానీ ఒక్కొక్కరూ టీడీపీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. 

తెలుగుదేశం పార్టీకి వీరవిధేయులు, చంద్రబాబు నాయుడుకు అత్యంత ఆప్తులే పార్టీని వీడుతున్నారు. దాంతో చంద్రబాబు నాయుడు తలపట్టుకుంటున్నారట. గత ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీ నేతలు చాలా మంది పోటీ చేసిన నియోజకవర్గాల్లో అడ్రస్ లేకుండా పోతున్నారట. 

సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా ఓటమిపాలైన నేతలు అసలు నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడటం లేదట. నామ్ కే వాస్తే ఒకటి రెండుసార్లు వచ్చి నియోజకవర్గంలో కనిపించి హల్ చల్ చేసినప్పటికీ ఆ తర్వాత నెమ్మదిగా జారుకుంటున్నారు. 
 
అలాంటి వారిలో టీడీపీ యంగ్ లేడీ లీడ‌ర్, మాజీ ఎంపీ మాగంటి ముర‌ళీమోహ‌న్ కోడ‌లు మాగంటి రూపాదేవి సైతం చేరిపోయారంటూ ప్రచారం జరుగుతుంది. 2019 ఎన్నికల్లో రాజమండ్రి లోక్ సభ అభ్యర్థిగాపోటీ చేసిన ఆమె ఓటమి పాలయ్యారు. ఆనాటి నుంచి పార్టీకి దూరంగా ఉంటున్నారు. 

2019 ఎన్నికల్లో తన మామ మాగంటి మురళీమోహన్ సిట్టింగ్ నియోజక వర్గం అయిన రాజమండ్రి లోక్ సభ నుంచి పోటీ చేశారు. ఆమె గెలుపు నల్లేరుపై నడకేనని అంతా భావించినప్పటికీ వైసీపీ వేవ్ లో కొట్టుకుపోయారు. 

వైసీపీ అభ్య‌ర్థి మార్గాని భ‌ర‌త్ చేతిలో 1.20 ల‌క్ష‌ల ఓట్ల భారీ తేడాతో ఘోరంగా ఓటమిపాలయ్యారు. ఎన్నిక‌ల్లో ఓటమి పాలైన తర్వాత కూడా ఆమె నియోజకవర్గంలో ఉన్నారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ తాను పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని ఏ ఫంక్షన్ కు ఆహ్వానించినా హాజరవుతానని మరీ చెప్పుకొచ్చారు. 

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బందులకు గురైతే తాను అండగా నిలబడతానని కూడా చెప్పుకొచ్చారు. 2009 ఎన్నికల్లో రాజమండ్రి లోక్ సభకు పోటీ చేసిన మురళీమోహన్ కాంగ్రెస్ అభ్యర్థి ఉండవల్లి అరుణ్ కుమార్ చేతిలో ఓటమి పాలయ్యారు. 

మురళీమోహన్ ఓటమి పాలైనప్పటికీ నియోజకవర్గాన్ని విడిచి పోలేదు. అప్పుడప్పుడూ వస్తూ ఉండేవారు. కార్యకర్తలకు అందుబాటులో ఉండేవారు. దాంతో మామకు తగ్గ కోడలు అని అంతా రూపాదేవిని పొగడ్తలతో ముంచెత్తారు.  

అలా చెప్పి హైదరాబాద్ వెళ్లిన రూపాదేవి నాలుగు మూడు నెలలుగా కానరాకపోవడంతో ఆమె బిజీబిజీగా ఉన్నారేమోనని కార్యకర్తలు భావించారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశానికి సైతం రూపాదేవి గైర్హాజరయ్యారు. 

చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశానికి సైతం రూపాదేవి డుమ్మా కొట్టడంతో ఇక నియోజకవర్గానికి దూరమయ్యారని కార్యకర్తలు భావించారు. టీడీపీలో ఉంటే పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ ఉంటుంద‌న్న గ్యారెంటీ లేక‌పోవ‌డంతోనో లేక ఇష్టం లేకనో ఆమె సైలెంట్ అయిపోయారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. 

రూపాదేవి రాజకీయాల్లో ఉండటంపై మురళీమోహన్ కుటుంబ సభ్యులు అంగీకరించడం లేదని ప్రచారం జరుగుతుంది. రాజకీయాల్లోకి వెళ్లొద్దని కుటుంబ సభ్యులు ఒత్తిడిపెంచడంతో ఆమె రాజమండ్రిలోని పార్టీ కార్యాలయాన్ని సైతం ఖాళీ చేసేశారు.  

కార్యాలయంలో పనిచేసే సిబ్బందిని సైతం తొలగించారు. దాంతో ఇక రూప రాజమండ్రికి వచ్చే పరిస్థితి ఉండకపోవచ్చనీ టీడీపీ స్థానిక నేతలు కొందరు చర్చించుకుంటున్నారు. ఈ విష‌యాన్ని ముర‌ళీమోహ‌న్ స‌న్నిహితులే చ‌ర్చించుకుంటుండ‌డం విశేషం.  

రూపాదేవి రాజ‌కీయాల్లో కొనసాగేందుకు ఆస‌క్తితో ఉన్నా ఐదేళ్ల పాటు లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని 7 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలను పర్యవేక్షించడం చాలా ఆర్థికభారంతో కూడుకున్నదని అందువల్లే కుటుంబ సభ్యులు సుముఖంగా లేరని తెలుస్తోంది.  

కుటుంబ సభ్యుల ఒత్తిడి గురించి తెలుసుకున్న చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగారు. మీరు ఇబ్బంది పెట్ట‌వ‌ద్ద‌ని ముర‌ళీమోహ‌న్ కుటుంబ స‌భ్యుల‌కు చెప్పినా వారు అంగీకరించలేదని తెలుస్తోంది. దాంతో రూపాదేవి ఇక టీడీపీకి దూరమైనట్లేనని తెలుస్తోంది. 
 

ఈ వార్తలు కూడా చదవండి

చంద్రబాబుకు తెలుగు తమ్ముళ్లు ఝలక్: మురళీమోహన్ కోడలు కూడా

పవన్ వల్లే టీడీపీ అధికారంలోకి వచ్చిందా..? నేను అంగీకరించను : మాజీ ఎంపీ మురళీమోహన్