ఏలూరు: సార్వత్రిక ఎన్నికల సమయంలో పట్టుబడిన రూ. 1.92 కోట్లు తనదేనని  ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు విజయవాడ పోలీస్ కమిషనర్ కు  విజ్ఞప్తి చేశారు.ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఏప్రిల్ 10వ తేదీన సిమెంట్ లోడులో లారీలో తరలిస్తున్న రూ. 1,92,90 ,500 నగదును విజయవాడ పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.

జగ్గయ్యపేట నుండి ఏలూరు వెళ్లున్న లారీని కామినేని ఆసుపత్రి సమీపంలో చెక్‌పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తున్న సమయంలో ఈ డబ్బులను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. 

సిమెంట్ బస్తాల మధ్య రెండు బస్తాల రెండు బాక్స్‌లు ఉండటాన్ని గమనించి వాటిని తెరిచి చూడగా భారీ నగదు కన్పించింది.  ఈ సమయంలో అదే లారీలో ప్రయాణిస్తున్న మాగంటి బాబు అనుచరుడు పారిపోయాడు. డ్రైవర్ కోగంటి సతీష్ ను విచారిస్తే తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు.

లారీలో  వచ్చిన యువకుడు ఏలూరు టీడీపీ అభ్యర్ధి కోసం డబ్బులు తీసుకెళ్తున్నట్టుగా డ్రైవర్ చెప్పారు.ఎలాంటి ఆధారాలు, పత్రాలు లేకుండా తరలిస్తున్న ఆ మొత్తాన్ని అప్పట్లో విజయవాడ నగర పోలీసులు సీజ్ చేసి ఆదాయపు పన్ను శాఖాధికారులకు సమాచారం ఇచ్చారు.

ఈ డబ్బు తనదేనని ఈ డబ్బును ఇప్పించాలని  మాగంటి బాబు విజయవాడ కమిషనర్ ను రెండు రోజుల క్రితం కలిసి కోరారు. ఇందుకు సంబంధించిన లావాదేవీ పత్రాలను ఆదాయపన్ను శాఖ అధికారులకు చూపితే రూ. 64 లక్షల పన్ను విధించారని వివరించారు.

పన్ను చెల్లించిన దృష్ట్యా సీజ్ చేసిన డబ్బును  తనకు ఇప్పించాలన్నారు. చేపల విక్రయిస్తే వచ్చిన ఆదాయం అయితే పన్నులు చెల్లించకుండా ఎందుకు రహస్యంగా ఎందుకు తరలించాల్సి వచ్చిందనే ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి.