అమరావతి: ప్రజా వేదికపై టీడీపీ నేతు భిన్న స్వరాలు విన్పిస్తున్నారు. సీనియర్లు సైతం ప్రజా వేదిక భవనాన్ని కూల్చివేయడాన్ని తప్పుబడుతున్నారు. కానీ, మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు మాత్రం ప్రజా వేదిక కూల్చివేయడాన్ని నిరసిస్తూ ఆందోళన చేయడాన్ని  సరైంది కాదని తేల్చి పారేశారు.

బుధవారం నాడు తోట త్రిమూర్తులు మీడియాతో మాట్లాడారు. ప్రజా వేదికను కూల్చివేయడంపై ఆయన స్పందించారు.చంద్రబాబు మెప్పు కోసం ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆందోళన చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

చంద్రబాబుకు భజన చేయడం మానుకోవాలని  ఆయన సూచించారు.  టీడీపీ నేతలు మారకపోతే ప్రజలు క్షమించరని ఆయన  అభిప్రాయపడ్డారు.ప్రజా వేదిక కూల్చివేతను నిరసిస్తూ ఆందోళన చేస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని  ఆయన చెప్పారు. 

వారం రోజుల క్రితం కాకినాడ వేదికగా టీడీపీలోని కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి వెళ్లకూడదని చంద్రబాబు వారించినా కూడ సుమారు 14 మంది నేతలు మీటింగ్‌లో పాల్గొన్నారు.