కడప: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై సిట్ దర్యాప్తు బృందం విచారణను వేగవంతం చేసింది. విచారణలో భాగంగా టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. 

మాజీమంత్రి వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తనను ఎందుకు విచారణకు పిలిచారో అర్థం కావడం లేదన్నారు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి. వైయస్ వివేకానందరెడ్డి హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. 

వైయస్ వివేకా హత్యపై సిట్ దర్యాప్తు ముమ్మరం చేస్తున్న తరుణంలో తనను విచారణకు పిలిచారని తెలిపారు. పోలీసుల విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని స్పష్టం చేశారు. సిట్ బృందం తనకు నోటీసులు ఇవ్వడంతోనే కడపకు వచ్చినట్లు తెలిపారు బీటెక్ రవి. 

బీటెక్ రవితోపాటు మరొకరు పరమేశ్వర్ రెడ్డి కూడా సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. బీటెక్ రవితోపాటు పరమేశ్వర్ రెడ్డికి కూడా సిట్ దర్యాప్తు బృందం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. 

మదనపల్లె మార్కెట్ యార్డు సందర్శనకు పవన్ కు అనుమతి

కడప జిల్లాలోని జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రంలో జిల్లా ఎస్పీ అన్బురాజన్ నేతృత్వంలో విచారణ కొనసాగుతుంది. ఇకపోతే బుధవారం వైయస్ వివేకానందరెడ్డి డ్రైవర్లను సిట్ బృందం విచారించింది. వారి వివరాల ప్రకారం బీటెక్ రవిని విచారణకు పిలిచినట్లు సమాచారం. 

వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసును పూర్తి చేయాలనే ఆలోచనలో ఉంది సిట్ దర్యాప్తు బృందం. నాలుగు నెలలుగా జరుగుతున్న సిట్ బృందం విచారణ తుది దశకు చేరుకుందని తెలుస్తోంది. మరో వారం రోజులపాటు విచారించి అనంతరం వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతుంది.  

కడప జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రంలో సిట్ బృందం పలువురిని విచారిస్తోంది. ఈ కేసులో వైయస్ వివేకానందరెడ్డి సోదరులు, ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి తండ్రి వైయస్ భాస్కరరెడ్డి, వైయస్ మనోహర్ రెడ్డిలతో పాటు కొందరు టీడీపీ నేతలను రహస్యంగా విచారించారు. 

ఇకపోతే బుధవారం కూడా మాజీమంత్రి వైయస్ వివేకానందరెడ్డి కారు డ్రైవర్ లు దస్తగిరి, ప్రకాష్ అనే వ్యక్తిని సిట్ బృందం విచారించింది. అనంతరం బుధవారం స్థానిక టీడీపీ నేత, ఎమ్మెల్సీ బీటెక్ రవికి నోటీసులు జారీ చేయగా గురువారం ఆయన విచారణకు హాజరయ్యారు.  

సుజనా చౌదరికి షాక్.... ఆయన భార్యకు డీఆర్టీ నోటీసులు

 బీటెక్ రవి విచారణ అనంతరం మాజీమంత్రి ఆదినారాయణరెడ్డిని సైతం విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆదినారాయణరెడ్డిపై వైయస్ కుటుంబ సభ్యులు పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.  

ఇకపోతే ఈ ఏడాది మార్చి 14న వైయస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఆయన ఇంట్లోనే గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ హత్యపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

అయితే చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ పై వైయస్ కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో జగన్ ప్రభుత్వం మరో సిట్ ను ఏర్పాటు చేసింది. ఈ కేసులో అనుమానితులుగా ఉన్న పలువురికి ఇప్పటికే నార్కో అనాలిసిస్ టెస్టులు కూడా నిర్వహించింది. ఇకపోతే ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాసుల రెడ్డి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. 

వైఎస్ వివేకా హత్యకేసులో కీలక మలుపు: టీడీపీ ఎమ్మెల్సీకి నోటీసులు