Asianet News TeluguAsianet News Telugu

వైఎస్ వివేకా హత్యకేసులో కీలక మలుపు: టీడీపీ ఎమ్మెల్సీకి నోటీసులు

కడప జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రంలో సిట్ బృందం పలువురిని విచారిస్తోంది. ఈ కేసులో వైయస్ వివేకానందరెడ్డి సోదరులు, ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి తండ్రి వైయస్ భాస్కరరెడ్డి, వైయస్ మనోహర్ రెడ్డిలతో పాటు కొందరు టీడీపీ నేతలను రహస్యంగా విచారించారు. 
 

Ys Vivenkananda reddy murder case: sit team issued notices to tdp mlc b.tech ravi
Author
Kadapa, First Published Dec 4, 2019, 7:05 PM IST

కడప: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై సిట్ దర్యాప్తు బృందం విచారణను వేగవంతం చేసింది. విచారణలో భాగంగా టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవికి నోటీసులు జారీ చేయడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. 

నాలుగు నెలలుగా జరుగుతున్న సిట్ బృందం విచారణ తుది దశకు చేరుకుందని తెలుస్తోంది. మరో వారం రోజులపాటు విచారించి అనంతరం వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతుంది.  

కడప జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రంలో సిట్ బృందం పలువురిని విచారిస్తోంది. ఈ కేసులో వైయస్ వివేకానందరెడ్డి సోదరులు, ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి తండ్రి వైయస్ భాస్కరరెడ్డి, వైయస్ మనోహర్ రెడ్డిలతో పాటు కొందరు టీడీపీ నేతలను రహస్యంగా విచారించారు. 

ఇకపోతే బుధవారం కూడా మాజీమంత్రి వైయస్ వివేకానందరెడ్డి కారు డ్రైవర్ దస్తగిరితోపాటు ప్రకాష్ అనే వ్యక్తిని సిట్ బృందం విచారించింది. అనంతరం బుధవారం స్థానిక టీడీపీ నేత, ఎమ్మెల్సీ బీటెక్ రవికి నోటీసులు జారీ చేసింది. 

గురువారం విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసులో పేర్కొంది సిట్ దర్యాప్తు బృందం. బీటెక్ రవికి నోటీసులు జారీ చేయడంపై కడప జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. బీటెక్ రవి ఇచ్చిన సమాచారం ఆధారంగా మరింత లోతుగా విచారణ జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది. 

బీటెక్ రవి విచారణ అనంతరం మాజీమంత్రి ఆదినారాయణరెడ్డిని సైతం విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆదినారాయణరెడ్డిపై వైయస్ కుటుంబ సభ్యులు పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.  

ఇకపోతే ఈ ఏడాది మార్చి 14న వైయస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఆయన ఇంట్లోనే గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ హత్యపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

అయితే చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ పై వైయస్ కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో జగన్ ప్రభుత్వం మరో సిట్ ను ఏర్పాటు చేసింది. ఈ కేసులో అనుమానితులుగా ఉన్న పలువురికి ఇప్పటికే నార్కో అనాలిసిస్ టెస్టులు కూడా నిర్వహించింది. ఇకపోతే ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాసుల రెడ్డి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. 

వైఎస్ వివేకా హత్య: ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి సహా పలువురి విచారణ

Follow Us:
Download App:
  • android
  • ios