గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మాజీమంత్రి యనమల రామకృష్ణుడు. సీఎం జగన్ జైలుకెళ్లడం ఖాయమన్నారు. జగన్ పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. 

జగన్ కు ఆర్థిక వ్యవస్థ గురించి ఏమీ తెలియదని విమర్శించారు. కానీ ఆర్థిక నేరాలు ఎలా చేయాలో మాత్రం తెలుసునంటూ సెటైర్లు వేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఏపీ తిరోగమన దిశలో పయనిస్తుందని విమర్శించారు. 

ఏపీ ఆర్థిక వ్యవస్థను భ్రష్టుపట్టించారన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజావ్యతిరేక నిర్ణయాల వల్ల రాష్ట్రం నష్టపోతుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు యనమల. వైయస్ జగన్ ప్రకటిస్తున్న అన్ని సంక్షేమ పథకాలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని అమలుకు నోచుకోవడం లేదని విమర్శించారు. 

ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రులు, అధికారులు కేవలం నామమాత్రంగానే ఉన్నారంటూ ఆరోపించారు. జగనే మెుత్తం వ్యవహారమంతా చూసుకుంటున్నారని అధికారులు మంత్రులు కేవలం పేరుకేనంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

తెలుగు ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పాలని నిలదీశారు. అలాగే నవ్యవాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం ఎప్పుడు ప్రారంభం అవుతుంది ఎప్పటికీ పూర్తి చేస్తారో తెలపాలని యనమల డిమాండ్ చేశారు. 

ఇకపోతే సీఎం జగన్ కు సీబీఐ కోర్టులో చుక్కెదురు అవ్వడంపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వకూడదన్నారు. జగన్ సాక్షులను ప్రభావితం చేస్తారంటూ మండిపడ్డారు. 

జగన్ సీబీఐ కోర్టు విచారణకు వెళ్తే రూ.60 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ వ్యక్తిగతానికి సంబంధించిన కేసుకు ప్రభుత్వ సొమ్ముును ఎందుకు ఖర్చుపెట్టాలని నిలదీశారు మాజీమంత్రి యనమల.

ఈ వార్తలు కూడా చదవండి

సీబీఐ కోర్టులో చుక్కెదురు: హైకోర్టులో జగన్ పిటిషన్ దాఖలు

YS Jagan: జగన్ కు సిబిఐ కోర్టు షాక్.. ప్రతి శుక్రవారం కోర్టుకు రావాల్సిందే

వైసీపీలో టెన్షన్: జగన్ ఆస్తుల కేసులో సీబీఐ తీర్పు నేడే