జనసేన టెంట్ హౌస్ పార్టీ: పవన్ కు పేర్ని నాని కౌంటర్
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి పేర్నినాని విమర్శలు గుప్పించారు. జనసేన టెంట్ హౌస్ పార్టీ అంటూ మండిపడ్డారు.
అమరావతి: జనసేన టెంట్ హౌస్ పార్టీ అని మాజీ మంత్రి పేర్నినాని విమర్శించారు. శుక్రవారంనాడు మాజీ మంత్రి పేర్నినాని మీడియాతో మాట్లాడారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని నిన్న కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. వైసీపీ సర్కార్ పై విమర్శలు చేశారు. ఈ విషయమై పేర్ని నాని మందిపడ్డారు. 2014లో పార్టీ ఏర్పాటు చేసిన సమయంలో తనకు బలం లేదని పవన్ కళ్యాణ్ కు తెలుసునని ఆయన చెప్పారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబుపై వ్యతిరేకత ఉందని పవన్ కళ్యాణ్ గుర్తించారన్నారు. అందుకే పవన్ కళ్యాణ్ పోటీ చేశారని పేర్ని నాని విమర్శించారు. చంద్రబాబు రాజకీయ అవసరాల కోసమే పవన్ కళ్యాణ్ పార్టీని ఏర్పాటు చేశారని పేర్ని నాని చెప్పారు.
2024లో ఏపీ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి రాకుండా అడ్డుకుంటామని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. గత రెండేళ్ల క్రితం ఈ ప్రకటన చేశారు. ఇదే ప్రకటనకు కట్టుబడి ఉన్నట్టుగా పవన్ కళ్యాణ్ పునరుద్ఘాటించారు.
గత కొంతకాలంగా టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు , పవన్ కళ్యాణ్ లు వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. వైసీపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు విషయమై ఈ ఇద్దరి నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయకూడదనేది తమ విధానమని జనసేన ప్రకటించింది. ఈ క్రమంలోనే చంద్రబాబుతో చర్చలు జరుగుతున్నాయని జనసేన స్పష్టం చేసింది.
2014 ఎన్నికల సమయంలో బీజేపీ, టీడీపీ కూటమికి పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించారు. ఆ తర్వాత టీడీపీ, బీజేపీ కూటమికి పవన్ కళ్యాణ్ దూరమయ్యారు. 2019 ఎన్నికల్లో జనసేన లెఫ్ట్, బీఎస్పీతో కలిసి పోటీ చేసింది. కానీ ఈ ఎన్నికల్లో జనసేన ఒక్క సీటుతోనే సరిపెట్టుకుంది. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ, జనసేన మధ్య మైత్రి ఏర్పడింది. అయితే ఈ రెండు పార్టీల మధ్య ఇటీవల కాలంలో గ్యాప్ పెరుగుతూ వచ్చింది. అదే సమయంలో జనసేన, టీడీపీ మధ్య దూరం తగ్గింది. ఈ పరిణామాలు ఏపీ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకున్నాయి.