ప్రజా ప్రతినిధులు పార్టీలకతీతంగా పోరాటం చేసేంత వరకూ విశాఖపట్నం ప్రత్యేక రైల్వేజోన్ సాధ్యం కాదని సీనియర్ రాజకీయ నేత, మాజీ ఎంపి కొణతాల రామకృష్ణ అన్నారు. గురువారం కేంద్రప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. అందరూ ఎంతో ఆశతో ఎదురుచూసిన ప్రత్యేక రైల్వేజోన్ అంశాన్ని కేంద్రం ఏమాత్రం పట్టించుకోలేదు. దాంతో ఉత్తరాంధ్ర మొత్తం నిరాసలో కూరుకుపోయింది. అదే విషయాన్ని కొణతాల ‘ఏషియానెట్’తో ప్రత్యేకంగా ప్రస్తావిచారు.

నాయకత్వ లోపమే ఉత్తరాంద్రకు శాపమైపోయిందని వాపోయారు. పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులు ఏకమయ్యే వరకూ ఏ సమస్యా పరిష్కారం కాదని అభిప్రాయపడ్డారు. విభజన చట్టంలో నాటి యూపిఏ ప్రభుత్వం చేసిన హామీలను ఇప్పటి ప్రభుత్వం తుంగలొ తొక్కటం చాలా బాదాకరమన్నారు. ఒక ప్రభుత్వం ఇచ్చిన హామీని మరో ప్రభుత్వం పక్కన పడేయటమంటే ప్రజాస్వామ్యంపైనే ప్రజలకు నమ్మకం పోతుందన్నారు.

దశాబ్దాల ఉత్తరాంధ్ర డిమాండ్ పరిష్కారం పట్ల కేంద్రం నిర్లక్ష్య ధోరణిపై మండిపడ్డారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధిపై కేంద్రానికి శ్రద్ధ లేకపోవటం దురదృష్టకరమని ధ్వజమెత్తారు. విభజన చట్టంలో ఉన్న వాటిని కూడా ఎంపిలు సాధించలేకపోవటమంటే కవలం వారి చేతకాని తనంగానే భావించాలని ఎద్దేవా చశారు. సప్లిమెంటు బడ్జెట్లో అయినా ప్రత్యేక రైల్వేజోన్ అంశాన్ని కేంద్రం సానుకూలంగా స్పందించాలని కొణతాల డిమాండ్ చేశారు. అపరిష్కృతంగా ఉన్న రాయలసీమ, ఉత్తరాంధ్ర సమస్యలపై త్వరలో ఓ ఉద్యమం చేసే విషయంపై అందరినీ కలుస్తామని కొణతాల చెప్పారు.