అవినీతికి పాల్పడితే అరెస్ట్ చేయకుండా ముద్దు పెట్టుకుంటారా?: బాబుకు ఐటీ నోటీసులపై కొడాలి నాని
ఐటీ నోటీసులపై చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదని మాజీ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు.
అమరావతి: ఐటీ నోటీసులపై చంద్రబాబునాయుడు ఎందుకు నోరు మెదపడం లేదని మాజీ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. గురువారంనాడు కృష్ణా జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. అవినీతికి పాల్పడిన చంద్రబాబును అరెస్ట్ చేయకుండా ముద్దు పెట్టుకుంటారా అని ఆయన ప్రశ్నించారు.పాల వ్యాపారం చేస్తే పదివేల కోట్లు వస్తాయా అని అడిగారు.పాలు, పిడకలు అమ్మి దేశంలో ఎవరూ ఇంత ఆదాయం సంపాదించలేదని మాజీ మంత్రి కొడాలి నాని చెప్పారు.
టీడీపీ చీఫ్ చంద్రబాబుకు ఐటీ శాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసిందని హిందూస్థాన్ టైమ్స్ పత్రిక కథనం ప్రచురించింది. ఈ కథనాన్ని ఆధారంగా చేసుకుని వైసీపీ నేతలు చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తున్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అవినీతికి పాల్పడినట్టుగా తాము చే
స్తున్న ఆరోపణలకు ఐటీ శాఖ నుండి వచ్చిన నోటీసులే సాక్ష్యంగా ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ విషయమై చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబునాయుడు నిన్న చేసిన కామెంట్స్ చర్చకు దారితీశాయి. తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. తనపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆయన చెప్పారు. నాలుగున్నర ఏళ్లుగా రాష్ట్రంలో వైసీపీ అరాచకాలకు పాల్పడుతుందన్నారు.