కర్నూల్: తనను చంపేందుకు కిరాయి హంతకులకు సుఫారీ ఇచ్చిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియతో పాటు ఆమె భర్త భార్గవ్ రామ్ ను కూడ అరెస్ట్ చేయాలని టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు.

గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. తనను చంపేందుకు సూడో నక్సలైట్ సంజూ సుఫారీ తీసుకొన్నాడని తెలిసిన తర్వాత దీని వెనుక భూమా అఖిలప్రియ ఉన్నారని తనకు అనుమానం వచ్చిందన్నారు. పోలీసులే ఈ విషయాన్ని బయటపెట్టాలని తాను నోరు తెరవలేదన్నారు. భూమా అఖిలప్రియ మద్దతుదారులైన చింతకుంట రాంరెడ్డి, రవిచంద్రారెడ్డిల ద్వారా సంజూకు డబ్బులు చేరాయన్నారు.

ఈ కేసులో భూమా అఖిలప్రియతో పాటు ఆమె భర్త భార్గవ్ రామ్ ను ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆయన పోలీసులను ప్రశ్నించారు. తనను హత్య  చేస్తే తన ముగ్గురు కూతుళ్ల పరిస్థితి ఏమయ్యేదని ఆయన ప్రశ్నించారు. 

కన్న కూతరిలా భూమా అఖిలప్రియను పెంచినట్టుగా ఆయన తెలిపారు. కానీ కూతురిలా పెంచిన తననే చంపేందుకు సుఫారీ ఇచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలాంటి అఖిలప్రియకు టిక్కెట్టు ఇచ్చి ప్రోత్సహించకూడదని ఏవీ సుబ్బారెడ్డి చంద్రబాబునాయుడును కోరారు. తన బాధను అర్ధం చేసుకోవాలని ఆయన కోరారు. చేతులు జోడించి వేడుకొంటున్నానని ఆయన పార్టీ నాయకత్వాన్ని కోరారు. తనకు చంద్రబాబునాయుడు సహాయం చేశారని ఆయన గుర్తు చేసుకొన్నారు.

జైలు జీవితం గడిపితే మరోసారి ఇలాంటి తప్పు  ఎవరూ కూడ చేయరన్నారు. నాకు భయం లేదు. వాళ్లకు చేతనైంది నాకు చేతకాదా అని ఆయన ప్రశ్నించారు. నా కార్యకర్తలు నాకు ఉన్నారని ఆయన చెప్పారు. పోలీసులపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు.