రెండు నెలల్లో మహత్తర కార్యక్రమానికి శ్రీకారం: అనుచరులతో ఆనం రామనారాయణ రెడ్డి
నిధుల మంజూరు కోసం అవసరమైతే కోర్టుకు వెళ్దామని మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు.
నెల్లూరు: మూడేళ్ల నుండి ఎలాంటి నిధులు ఇవ్వలేదని.... నిధుల మంజూరు కోసం అవసరమైతే కోర్టుకు వెళ్దామని మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అనుచరులకు చెప్పారు.నెల్లూరు జిల్లాలోని రావూరులో తన అనుచరులతో మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి గురువారం నాడు సమావేశమయ్యారు.ఈ సమావేశంలో గత కొంత కాలంగా చోటు చేసుకున్న పరిణామాల గురించి కార్యకర్తలకు వివరించారు. మరో రెండు నెలల్లో మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్టుగా మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రకటించారు.ఇందు కోసం అందరం సంఘటితం కావాల్సిన అవసరం ఉందన్నారు.
వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీకి చాలా బలమైన నియోజకవర్గంగా మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. అలాంటి వెంకటగిరి మున్సిపాలిటీలో బాగా కష్టపడితేనే 2 వేలు ఓట్ల మెజారిటీ వచ్చిందని ఆనం రామనారాయణ రెడ్డి కార్యకర్తల వద్ద ప్రస్తావించారు. సమస్యలు పరిష్కరించలేనప్పుడు పదవులు ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. సమస్యలు పరిష్కరించాలని కోరడం తప్పా అని ఆయన అడిగారు. రావూరు నుండి వెంకటగిరి వెళ్లాలంటే రెండున్నర గంటల సమయం పడుతుందని మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా మారిందన్నారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితిని చూడలేదని మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు.
also read:నాకు ప్రాణ హని ఉంది: మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సంచలనం
తనను వద్దనుకుని వేరే వాళ్లను పెట్టుకున్నారన్నారు. ముగ్గురు పరిశీలకులు వచ్చారు... వెళ్లారని ఆనం గుర్తు చేశారు. ఇప్పుడు నాలుగో కృష్ణుడు వచ్చాడని పరోక్షంగా నేదురుమల్లి రాంకుమార్ రెడ్డిపై సెటైర్లు వేశారు రామనారాయణ రెడ్డి. 2014లో వెంకటగిరి నుండి పోటీ చేసిన రాంకుమార్ రెడ్డి మధ్యలోనే వెళ్లిపోయాడని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇప్పుడు నాలుగో కృష్ణుడిగా వచ్చాడన్నారు.