ఆంధ్రప్రదేశ్‌లోని జగన్ ప్రభుత్వానికి సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ థాంక్స్ చెప్పారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో ఓ పోస్టు చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని జగన్ ప్రభుత్వానికి సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ థాంక్స్ చెప్పారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో ఓ పోస్టు చేశారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న చుక్కల భూముల సమస్యను క్లియర్ చేసినందుకు ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు అని పేర్కొన్నారు. భూయజమానులకు అవసరమైన సరిచేసిన భూపత్రాలు త్వరలో లభిస్తాయని ఆశిస్తున్నానని చెప్పారు. అయితే ఈ ట్వీట్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పందించింది. వైసీపీ అధికార ట్విట్టర్ హ్యాండిల్ నుంచి లక్ష్మినారాయణ ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు.
‘‘థ్యాంక్యూ లక్ష్మీ నారాయణ గారూ! ఇది జగనన్న ప్రభుత్వం... మన రైతన్న ప్రభుత్వం. దశాబ్దాల నాటి చుక్కల భూమి చిక్కులకు శాశ్వత పరిష్కారం చూపించి రైతుల భూములకు సర్వ హక్కులు కల్పించిన రైతు బాంధవుదు సీఎం వైఎస్ జగన్. ఇదీ రైతన్నల పట్ల జగనన్న ప్రభుత్వానికి ఉన్న చిత్త శుద్ధి’’ అని వైసీపీ ట్వీట్ చేసింది.
గతంలో బహిరంగ ర్యాలీలు, రోడ్ షోలకు సంబంధించి తీసుకొచ్చిన జీవో నెంబర్ 1 విషయంలో కూడా జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని వీవీ లక్ష్మినారాయణ సమర్ధించారు. ‘‘ఈ పోలీసు చట్టం 1861లో వచ్చింది. అనేక రాష్ట్రాలు వాళ్లవాళ్ల పోలీస్ యాక్ట్ తీసుకొచ్చాయి. సభలు పెట్టాలంటే.. సంబంధింత పోలీస్ స్టేషన్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. అన్ని వివరాలు ఇస్తే.. వాళ్లు ఏర్పాట్లు చేస్తారు. తాజాగా ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలో కొత్త విషయం ఏమీ లేదు. అన్ని పాత అంశాలే. ప్రతీదాన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు’’ అని పేర్కొన్నారు.
ఇక, యూపీఏ హయాంలో వైఎస్ జగన్ పై అక్రమాస్తుల కేసుల విషయంలో అప్పుడు సీబీఐ జేడీగా ఉన్న వీవీ లక్ష్మినారాయణ ప్రాచుర్యం పొందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వీఆర్ఎస్ తీసుకున్న లక్ష్మినారాయణ గత ఎన్నికల్లో జనసేన తరపున విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కొంతకాలానికే జనసేన నుంచి బయటకు వచ్చారు. మళ్లీ ఆయన విశాఖపట్నం నుంచి బరిలో నిలవాలని చూస్తున్నారు. అయితే లక్ష్మినారాయణను వైసీపీలో చేర్చుకునే ప్రయత్నాలు జరిగాయని వార్తలు వచ్చాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో లక్ష్మినారాయణ మాట్లాడుతూ.. తనకు బీఆర్ఎస్, వైసీపీల నుంచి పార్టీలో చేరాల్సిందిగా ఆఫర్ వచ్చిందని చెప్పారు.
