మేఘా ఇంజనీరింగ్ కంపెనీకి పీవీ రమేశ్ రాజీనామా.. ట్విట్టర్‌లో ఆసక్తికర పోస్టు..
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌కు సంబంధించి మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా పీవీ రమేష్.. తాను పనిచేస్తున్న మేఘా ఇంజనీరింగ్ కంపెనీకి రాజీనామా చేశారు.
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌కు సంబంధించి మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా పీవీ రమేష్.. తాను పనిచేస్తున్న మేఘా ఇంజనీరింగ్ కంపెనీకి రాజీనామా చేశారు. ఈ మేరకు మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఎండీ పీవీ కృష్ణారెడ్డికి రాజీనామా లేఖను పంపారు. వ్యక్తిగత కారణాలతోనే తాను తప్పుకుంటున్నట్టుగా లేఖలో పీవీ రమేశ్ పేర్కొన్నారు. తనను రాజీనామా చేయమని మేఘా సంస్థ కోరలేదని వెల్లడించారు. ఇక, స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ సంబంధించి పీవీ రమేష్ ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఇక, ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కూడా పీవీ రమేశ్ ఒక పోస్టు చేశారు. ‘‘నా జీవితాంతం నేను రాజకీయ, సామాజిక, ఆర్థిక, వాణిజ్య అంశాలకు అతీతంగా ప్రజా ప్రయోజనాల కోసం నిరంతరం, నిస్సందేహంగా పనిచేశాను. ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా, నా మనస్సాక్షికి వ్యతిరేకంగా ఏదైనా చేయమని ఎవరూ కూడా నన్ను బలవంతం చేయలేరు. భగవంతుడు కూడా’’ అని పీవీ రమేష్ పేర్కొన్నారు.
ఇదిలాఉంటే, ఓ ఇంటర్వ్యూలో పీవీ రమేష్ మాట్లాడుతూ స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో తన స్టేట్‌మెంట్ ఆధారంగానే కేసు పెట్టారని అనడం దిగ్భ్రాంతికరమని పేర్కొన్నారు. రమేష్ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన వ్యాఖ్యలకు ప్రధానాత్య సంతరించుకుంది. ఈ నేపథ్యంలో పీవీ రమశ్ వ్యాఖ్యలపై సీఐడీ వర్గాలు స్పందించాయి. పీవీ రమేశ్ ఇచ్చిన ఒక్క స్టేట్‌మెంట్‌తోనే కేసు మొత్తం నడవడం లేదని సీఐడీ పేర్కొంది. దర్యాప్తు ప్రక్రియలో పీవీ రమేశ్ స్టేట్ మెంట్ ఒక భాగం మాత్రమేనని తెలిపింది.
ఈ క్రమంలోనే పీవీ రమేశ్ సోమవారం సాయంత్రం ప్రెస్ మీట్ నిర్వహించనున్నారనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఆయన సలహాదారుగా ఉన్న మేఘా ఇంజినీరింగ్ కంపెనీ నుంచి అభ్యంతరం వ్యక్తం కావడంతోనే దానిని రద్దు చేసుకున్నరానే ప్రచారం కూడా తెరపైకి వచ్చింది. ఈ క్రమంలోనే ఆయన తన ఉద్యోగానికి సోమవారమే రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది.