విశాఖపట్టణం: కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ విభజన హమీలను సాధించడంలో చంద్రబాబునాయుడు వైఫల్యం చెందారని  మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు.  ఎన్డీఏ నుండి  బాబు బయటకు రావడం బాబుదే తప్పన్నారు.

మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి బుధవారం నాడు విశాఖలో మీడియాతో మాట్లాడారు.కాంగ్రెస్ పార్టీని వీడాలని తాను ఏనాడూ అనుకోలేదన్నారు. పరిస్థితుల ప్రభావంతోనే తాను అప్పట్లో కాంగ్రెస్ పార్టీని వీడినట్టు ఆయన చెప్పారు.

ఎన్నికల ముందు మోడీ, చంద్రబాబునాయుడులు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్డీఏతో చేతులు కలిపి టీడీపీ బయటకు వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఎన్డీఏ నుండి  బయటకు రావడంలో  చంద్రబాబుదే తప్పని  కిరణ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ‌ ఇన్ని రోజులు ఎందుకు నడుస్తున్నారని  ఆయన ప్రశ్నించారు.

పార్టీ  అనేది వ్యక్తి కంటే గొప్పదన్నారు. పార్టీ కంటే ప్రజలు గొప్పవారని  ఆయన అభిప్రయాపడ్డారు. బీజేపీ అన్ని విషయాల్లో ఫెయిలైందన్నారు.విభజన హామీలు అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు.

ఏపీకి ప్రత్యేక హోదాతో  పాటు విభజన హామీలు కావాలంటే  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించి అధిక సీట్లలో గెలిపించాలని ఆయన కోరారు.