విశాఖ: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిపై ఎన్ ఫోర్స్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన అభియోగాలపై సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ స్పందించారు. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఆయన కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. 

విశాఖపట్నం జిల్లా చోడవరంలో ఆయన శనివారంనాడు విద్యార్థులను తీర్చిదిద్దడం ఎలా అనే అంశంపై ఉపాధ్యాయులకు శిక్షణా శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ - వైఎస్ భారతిపై ఈడీ కేసు గురించి తనకు తెలియదని చెప్పారు. 

లక్ష్మీనారాయణ ఇటీవల తన పదవికి రాజీనామా చేసి, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ సమస్యలు తెలుసుకుంటున్నారు. అందులో భాగంగానే శనివారం విశాఖలోని చోడవరంలో విద్యార్థులతో సమావేశం అయ్యారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఉన్న శిఖరాల అధిరోహణ కోసం లక్ష్యాలను నిర్ధేశించుకోవాలని లక్ష్మీనారాయణ సూచించారు. 

రాష్ట్రంలో 17 వేల గ్రామాల్లో స్థానిక సమస్యలపై పీపుల్స్ మేనిఫెస్టో తయారు చేసి రాజకీయ పార్టీలకు అందజేస్తామని ఆయన చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందన్న నమ్మకం తనకు ఉందని ఐపీఎస్ మాజీ అధికారి లక్ష్మీనారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు.