ఏపీలో కొందరు పులిని చంపి.. దాని చర్మాన్ని అడవిలోని బావిలో పడేసి.. పులిని వండుకుతిన్నారన్న వదంతులు గుప్పుమన్నాయి. దీంతో అటవీ అధికారులు విచారణ చేపట్టారు. 

ప్రకాశం జిల్లా : ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో అటవీశాఖ అధికారులకు అందిన ఓ సమాచారం వారిని పరుగులు పెట్టించింది. కొంత మంది ఆ ప్రాంతంలో పులిని చంపి.. దాన్ని వండుకుని తిన్నారని వారికి సమాచారం అందింది. దీంతో అధికారులు వెంటనే స్పందించారు. దీనిమీద నిజానిజాలు తేల్చే దిశగా విచారణ చేపట్టారు. ఈ అటవీ ప్రాంతానికి చెందిన కొందరు గిరిజనులు అడవిలోని జంతువులను విద్యుత్ తీగలు పెట్టి వేటాడుతుంటారని ఆరోపణలు ఉన్నాయి. అడవి జంతువులైన దుప్పులు, మనపోతులను ఇలా గిరిజనులు పట్టుకుంటున్నారని చెబుతుంటారు. 

పుల్లలచెరువు మండలంలోని అక్కచెరువు చెంచుగూడెంకు సమీపంలోని ఎర్రదరి, ఈతల కొండ ప్రాంతాల్లో ఈ జంతువులను ఎక్కువగా వేటాడుతుంటారని అక్కడి స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 10వ తేదీన ఈ ప్రాంతంలో పులి సంచరిస్తుందన్న సమాచారం అటవీశాఖ అధికారులకు తెలిసింది. ఈ మేరకు విచారణ చేపట్టిన అధికారులకు పులిపాదముద్రలు కూడా ఆ ప్రాంతంలో కనిపించాయి. కాగా, పులిని ఎవరో వేటాడారని.. కరెంటు తీగలు పెట్టి చంపేశారని.. పులిని వండుకు తిన్నారని… చర్మాన్ని అడవిలో ఉన్న బావిలో పడేశారని సమాచారం అందింది. ఈ మేరకు గుర్తు తెలియని వ్యక్తులు ఎర్రగొండపాలెంలోని అటవీ శాఖ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. 

శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ‌లో హోమం పేరుతో సర్క్యూలర్.. ఉద్యోగుల అభ్యంతరం.. అసలేం జరిగిందంటే..?

కాగా, పులిని చంపి వండుకు తిన్న విషయాన్ని ఆ ప్రాంతంలో విధుల్లో ఉన్న సిబ్బంది కూడా ధ్రువీకరించినట్లుగా ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే పులిని చంపి దాని మాంసం వండుకు తిన్నారనే ప్రచారంలో వాస్తవం లేదని.. దీన్ని ఎవరు నమ్మవద్దని ఏ. నీలకంటేశ్వర్ రెడ్డి అనే ఫారెస్ట్ రేంజ్ అధికారి వివరణ ఇచ్చారు. అయితే ఈ మేరకు తమకు సమాచారం అందడంతో అక్కపాలెం ప్రాంతంలో విచారణ చేపట్టామని దీని మీద త్వరలోనే నిగ్గు తేలుస్తామని తెలిపారు.

అక్కపాలెం ప్రాంతంలో పులి సంచరిస్తుందని సమాచారం తమకు అందిందని ఈ మేరకు తాము అక్కడ పరీక్షించి పులి పాదముద్రలను కూడా సేకరించామని తెలిపారు. ఈ పాదముద్రల ఆధారంగా ఒక మగపులి, రెండు ఆడపులులు అక్కడ తిరుగుతున్నాయని తేలిందని ఆయన వివరించారు. అడవి జంతువులు ఎక్కువగా సంచరిస్తుండడం వల్ల అక్కపాలెం ప్రాంతంలో పులులు సహజంగానే ఎక్కువగా తిరుగుతుంటాయని అన్నారు. అడవి జంతువులను వేటాడడం కోసం విద్యుత్తు వైర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తమ దృష్టికి కూడా వచ్చిందని తెలిపారు.

ఎన్టీఆర్ మనవడైన కష్టాన్ని నమ్ముకున్నాడు.. ఆ ప్రయత్నంలోనే మరణించాడు: తారకరత్న భౌతికకాయానికి కొడాలి నాని నివాళి

దీనివల్ల పులులకు ప్రాణహానే ఉంటుందన్న విషయం నిజమేనన్నారు. దీని నివారణ కోసం అటవీ ప్రాంతంలో విద్యుత్ సౌకర్యం లేకుండా విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. అయితే పులిని చంపినట్లుగా వస్తున్న వదంతులు.. జోరు ప్రచారాల మీద దర్యాప్తు చేస్తున్నామని.. ఇంకా దర్యాప్తు పూర్తి కాలేదని ఎఫ్ఆర్ఓ తెలిపారు.