అనంతపురం‌లోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో జారీ చేసిన ఓ సర్క్యూలర్‌ తీవ్ర వివాదస్పదంగా మారింది. 

అనంతపురం‌ జిల్లాలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో జారీ చేసిన ఓ సర్క్యూలర్‌ తీవ్ర వివాదస్పదంగా మారింది. యూనివర్సిటీలోని ఉద్యోగులు, విద్యార్థుల క్షేమం కోసమంటూ 24న ధన్వంతరి మహా మృత్యుంజయ శాంతిహోమం నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి వర్సిటీ రిజిస్ట్రార్‌ లక్ష్మయ్య ఓ సర్క్యులర్‌ జారీ చేశారు. ఉద్యోగులు చందాలు ఇవ్వాలని ఇందులో పేర్కొన్నారు. టీచింగ్ ఉద్యోగులు రూ.500, నాన్ టీచింగ్ సిబ్బంది రూ.100 చెల్లించాలన్నారు. వర్సిటీ ఉద్యోగులు స్వచ్ఛందంగా పాల్గొనవచ్చని అన్నారు. 

అయితే ఈ సర్క్యూలర్‌పై ఉద్యోగులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వివాదంపై స్పందించిన రిజిస్ట్రార్‌ లక్ష్మయ్య.. హోమంలో పాల్గొనడం ఉద్యోగుల వ్యక్తిగతం అని అన్నారు. తాము ఎవరినీ బలవంతం చేయడం లేదని తెలిపారు. ఇటీవల కాలంలో యూనివర్సిటీలో పనిచేస్తున్న పలువురు వేర్వేరు కారణాలతో అకాలంగా మరణించారని చెప్పారు. అందుకే హోమం నిర్వహిస్తున్నట్టుగా చెప్పారు. యూనివర్సిటీ తరఫున హోమం నిర్వహించడం లేదని.. వర్సిటీ నిధులను వినియోగించడం లేదని తెలిపారు. 

ఇక, ఈనెల 24న మృత్యుంజయ హోమం జరుపుతున్నట్లు ఆదేశాలు జారీ చేయడం పట్ల విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనివర్సిటీలో ఇలాంటి చర్యలేమిటని ప్రశ్నించారు. బోధనేతర సిబ్బంది జీతాభత్యాల ఇవ్వడం లేదని.. వాటిని వెంటనే చెల్లించాలని కూడా డిమాండ్ చేశారు. అయితే ఈ వివాదంపై స్పందించిన యూనివర్సిటీ వీసీ.. అందరూ క్షేమంగా ఉండాలనే హోమం తలపెట్టినట్టుగా తెలిపారు. హోమం నిర్వహించడాన్ని తప్పుబడితే తానేం చేయలేనని అన్నారు.