సినీ నటుడు తారకరత్న భౌతికకాయానికి వైసీపీ ఎమ్మెల్యే కొడాల నాని నివాళులర్పించారు.
సినీ నటుడు తారకరత్న భౌతికకాయానికి వైసీపీ ఎమ్మెల్యే కొడాల నాని నివాళులర్పించారు. రంగారెడ్డి జిల్లా మోకిలలోని తారకరత్న నివాసానికి చేరుకున్న కొడాలి నాని.. ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ.. తారకరత్న చిన్న వయసులో మరణించడం బాధ కలిగించిందని చెప్పారు. తనకు తారకరత్నతో మంచి అనుబంధం ఉందని తెలిపారు. ఆయన తాతగారు పెట్టిన పార్టీ నుంచే పోటీ చేద్దామని అనుకున్నారని చెప్పారని తెలిపారు.
ఎన్టీఆర్ మనవడు అయినప్పటికీ.. తారకరత్న దేనికి ఆశపడకుండా కష్టాన్ని నమ్ముకున్నారని కొడాలి నాని చెప్పారు. సినిమాల్లో, రాజకీయాల్లో ఎన్టీఆర్ చూపించినదారిలో నడవాలని తాపత్రయపడ్డాడని అన్నారు. ఆ ప్రయత్నంలోనే మరణించడం జరిగిందన్నారు. తారకరత్న ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్టుగా పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియస్తున్నట్టుగా చెప్పారు.
ఇక, ఈరోజు మోకిలలోని నివాసంలోనే తారకరత్న భౌతికకాయాన్ని కుటుంబసభ్యులు, బంధువుల సందర్శనార్థం ఉంచనున్నారు. అయితే తారకరత్న భౌతిక కాయాన్ని రేపు(సోమవారం) అభిమానుల సందర్శనార్థం ఫిలింనగర్ లోని ఫిలించాంబర్‌లో ఉంచనున్నారు. రేపు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అక్కడే ఉంచనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటల తర్వాత తారకరత్న అంతిమయాత్ర ప్రారంభం కానుంది. ఐదు గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. నందమూరి కుటుంబసభ్యులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ అంత్యక్రియల్లో పాల్గొననున్నారు.
