చంద్రబాబునాయుడు ప్రచారయావకు అంతులేకుండా పోతోంది. ప్రచారం ఎక్కువైపోయి ఇబ్బందులు వస్తున్నా తన పద్దతి మాత్రం మార్చుకోవటం లేదు. విశాఖపట్నంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా శనివారం ప్రారంభమైన మూడు రోజుల పెట్టుబడుల సదస్సులో చంద్రబాబు మొదటి రోజే నవ్వులపాలయ్యారు. తాను నవ్వుల పాలవ్వటమే కాకుండా ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ కు కూడా ఇబ్బంది పడే పరిస్ధితి తెచ్చారు.

ఇంతకీ జరిగిందేమిటంటే, పెట్టుబడుల సదస్సు సందర్భంగా ప్రింట్ చేసిన ఇన్విటేషన్లో చంద్రబాబును ఏపి, తెలంగాణా రాష్ట్రాల ముఖ్యమంత్రిగా పేర్కొన్నారు. అదే సందర్భంలో ఇఎస్ఎల్ నరసింహన్ ను కేవలం ఏపికి మాత్రమే గవర్నర్ గా చూపించారు.

తెలుగు రాష్ట్రాల్లోని ఎవరిని అడిగినా చెబుతారు ఏపి, తెలంగాణా రాష్ట్రాలకు ముఖ్యమంత్రులెవరంటే? అటువంటిది ఇన్విటేషన్లు ప్రింట్ చేసిన వారికి తెలీదా చంద్రబాబు ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రో. ఎవరో అనామకులు కాదు కదా ఆన్విటేషన్లను ప్రింట్ చేసేది. అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నపుడు అంత పెద్ద తప్పు ఎలా జరుగింది?

మొదటి రోజు సదస్సులో మాట్లాడిన చంద్రబాబు కూడా రాష్ట్రానికి గతంలో నిర్వహించిన సదస్సుల ద్వారా లక్షల కోట్ల రూపాయల విలువైన ఎంవోయులు జరిగినట్లు చెప్పుకున్నారు. మూడుసార్లు జరిగిన పెట్టుబడుల సదస్సుల్లో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఎంతో అందరకీ తెలిసిందే. ఇటువంటి ప్రచారార్భాటం వల్లే చంద్రబాబును ప్రధానమంత్రి దూరం పెట్టి ఏపిని నిర్లక్ష్యం చేస్తోంది.