అమరావతి: వైసిపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బిసిల అభ్యున్నతికి ఎలా పాటుపడిందో తెలియజేయడానికి నిన్న(గురువారం) బిసి సంక్రాంతి సభ జరిగిన విషయం తెలిసిందే. అయితే జగన్ సర్కార్ నిర్వహించిన ఈ  సభలో పాల్గొన్న కొందరు తీవ్ర అస్వస్థతకు గురయినట్లు టిడిపి సీనియర్ నాయకులు అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. 

''పట్టుమని వెయ్యిమందికి భోజనం పెట్టలేని నీకు సభలు ఎందుకు జగన్ రెడ్డి. మీ మీటింగ్లలో ఫైవ్ స్టార్ ఫుడ్ తిని, బీసీలకు పాయిజన్ ఫుడ్ పెడతారా? భారీ జీతాలొచ్చే పదవులన్నీ ఒక సామాజిక వర్గానికి ఇచ్చి కనీసం కూర్చోడానికి కుర్చీ కూడా లేని పదవులు బీసీలకు విసిరేసినప్పుడే బీసీల పట్ల మీరు చూపిస్తున్న కపట ప్రేమ బయటపడింది'' అంటూ ట్విట్టర్ వేదికన అయ్యన్న మండిపడ్డారు. 

''బీసీ సభకు హాజరైన ముగ్గురు అస్వస్థతకు గురవ్వడం, బ్రహ్మయ్య గారు మృతి చెందడం బాధాకరం. బీసీలే కదా ఎదో ఒకటి పడేయండి అనే విధంగా జగన్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలనే బీసీల సభలో ఫుడ్ పాయిజన్ ఘటన చోటుచేసుకుంది'' అని మండిపడ్డారు. 

మరోవైపు టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కూడా రాజధాని విషయంలో సోషల్ మీడియా వేదికన వైసిపి నాయకులకు సవాల్ విసిరారు. ''అమరావతే రాజధాని అని ఎన్నికల ముందు ఊరు వాడా చెప్పి, ఎన్నికలు అవ్వగానే వైజాగ్ భూములు కొల్లగొట్టటం కోసం, ఏరు దాటాక తెప్ప తగలేసాడు మీ తుగ్లక్. అందుకే అడుగుతున్నాం. ఇంత పెద్ద పెద్ద అక్షరాలతో అమరావతే రాజధాని అని మీ గజెట్ లో కూడా వేసి ప్రచారం చేసి, ఇప్పుడు మూడు ముక్కలు చేసారు. అందుకే దొంగ మాటలు చెప్పినందుకు, రండి రిఫరెండంకి వెళ్దాం. ప్రజలే తేలుస్తారు, అమరావతి రాజధాని కావాలో, మూడు ముక్కల రాజధాని కావాలో. మీ ఫేక్ పార్టీకి దమ్ముందా సాయి రెడ్డి?'' అంటూ సవాల్ విసిరారు.