తెలుగు రాష్ట్రాలతో పాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వరద కారణంగా పోలవరం ప్రాజెక్ట్ స్పిల్ వే పూర్తిగా మునిగిపోయింది. స్పిల్ వే మీదుగా 2 మీటర్ల మేర నీరు ప్రవహిస్తోంది. కాఫర్ డ్యాం వద్ద సైతం వరద ప్రవాహం 28 మీటర్లకు చేరుకుంది.

పోలవరం మండలంలోని 19 గ్రామాలకు వారం రోజులుగా రాకపోకలు నిలిచిపోవడంతో..అధికారులు వారికి పునరావాసం, ఆహార, మందులు అందజేస్తున్నారు. ఇక తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్‌ 175 గేట్లను పూర్తిగా ఎత్తి నీటిని సముద్రంలోకి వదులుతున్నారు.

ప్రస్తుతం బ్యారేజ్ వద్ద 9.34 లక్షల క్యూసెక్కుల వరద నీరు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆనకట్ల వద్ద ప్రస్తుతం 11.2 అడుగుల మేర నీటి మట్టం ఉంది. వశిష్ట, వైనతేయ, గౌతమి నదులు ఉద్దృతంగా ప్రవహిస్తుండటంతో దేవిపట్నం మండలంలోని 26కు పైగా ఏజెన్సీ గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి.

చాలా ప్రాంతాల్లో అరటి తోటలు నీటమునగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవీపట్నం- తొయ్యూరు రహదారిపై 4 అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు స్తంభించిపోయాయి. లంక గ్రామాలను అప్రమత్తం చేసిన అధికారులు ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.