హైదరాబాద్: నూతన సంవత్సరం అంటే కొత్త సంవత్సరంలో అంతా మంచే జరగాలని అంతా కోరుకునే దినం. ఈ ఏడాది అంతా తమకు విజయాలు అందించాలని కోరుకోవడమే కాదు గత ఏడాది జరిగిన చెడును తలచుకుని అలా జరగకూడదనో, లేకపోతే మంచి జరిగితే అంతకంటే మంచి జరగాలనో కోరుకుంటారు. 

2019 సంవత్సరానికి స్వాగతం పలకడానికి ఎంత వేగంగా సంబరపడిపోతామో గుడ్ బై చెప్పే 2018లో జరిగే ఘటనలు మనం చర్చించుకుంటాం. అయితే 2018 సంవత్సరానికి వీడ్కోలు పలికే ముందు ఆ సంవ‌త్స‌రంలో జరిగిన ఘటనలు చూసుకుంటే ఏపీ రాజకీయాల్లో సంచలనాలు చోటు చేసుకున్నాయనే చెప్పాలి. కొన్ని పార్టీలకు మంచి జరిగితే మరికొన్ని పార్టీలకు చేదు అనుభవాలు మిగిల్చింది.  

ఇకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినే వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కత్తితో దాడి జరగడం తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనంగా మారింది. ఏపీ ప్రతిపక్ష నేతపైనే దాడి జరగడం పెద్ద చర్చకు తెరదీసింది. అంతేకాదు హస్తినను కూడా తాకింది. 

ఈ ఏడాది అక్టోబర్ 25న విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లాంజ్ లో వేచి ఉన్న జగన్ పై శ్రీనివాసరావు అనే వెయిటర్ కోడికత్తితో దాడి చేశాడు. శుక్రవారం 26న హైకోర్టులో కేసు విచారణ నిమిత్తం హాజరయ్యేందుకు విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్ గురువారం మధ్యాహ్నాం విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నాడు. 

ఎయిర్ పోర్ట్ లాంజ్ లో వేచి చేస్తున్న జగన్ కు ఎయిర్ పోర్ట్ లోని ఫజన్ రెస్టారెంట్ లో వెయిటర్ గా పనిచేస్తున్న శ్రీనివాసరావు అనే యువకుడు టీ పట్టుకొచ్చి జగన్ కి ఇచ్చాడు. బాగున్నారా అంటూ కుశల ప్రశ్నలు వేశాడు. 2019 ఎన్నికల్లో 160 సీట్లు వస్తాయా సార్ అంటూ మాటలు కలిపాడు. సెల్ఫీ దిగుతా అంటూ కోడికత్తితో కుడిభుజంపై దాడికి పాల్పడ్డాడు. 

ఈ ఘటన రాజకీయంగా దుమారం రేపింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం క‌లిగించింది. అటు వైసీపీ, టీడీపీల మధ్య అయితే వార్ నడిచింది. అదంతా డ్రామా అని కోడికత్తి నాటకం అంటూ ఏకంగా సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ దగ్గర నుంచి ప్రతీ ఒక్కరూ ఆరోపించారు. 

అయితే ఈ దాడి వెనుక చంద్రబాబు నాయుడు కుట్ర ఉందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర ఉందంటూ ఆరోపించింది. ఆపరేషన్ గరుడలో భాగంగా త్వరలో ఏపీలో ప్రముఖ నేతపై దాడి జరుగుతుందని అంతకుముందే సినీనటుడు శివాజీ చెప్పారు.  

ఆయన చెప్పినట్లు జరగడంతో ఆపరేషన్ గరుడ పేరు ఏపీ రాజకీయాల్లో హల్ చల్ చేసింది. చంద్రబాబు సినీనటుడు శివాజీతో కుమ్మక్కు అయి దాడి చెయ్యించాడని వైసీపీ ఆరోపించింది. ఆపరేషన్ గరుడ ప్రకారం చూస్తే కావాలనే జగన్ చేయించుకున్నాడని సెంటిమెంట్ తో 2019 ఎన్నికల్లో గెలవొచ్చని అతని ప్లాన్ అని టీడీపీ ఆరోపించింది. 

ఈ దాడి వెనుక బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఉన్నాయని వారి కనుసన్నుల్లోనే దాడి ప్లాన్ జరిగిందని టీడీపీ ఆరోపించింది. ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరునే కోడికత్తి పార్టీగా మార్చేసింది. ఇకపోతే ఈ ఘటనపై కేసు నమోదు చెయ్యడంలోనూ పెద్ద దుమారమే రేగింది. 

జగన్ పై దాడి తమ పరిధిలో జరగలేదని ఎయిర్ పోర్ట్ విమానాశ్రయంలో జరిగింది కాబట్టి కేంద్రప్రభుత్వమే బాధ్యత వహించాలని ఏపీ ప్రభుత్వం ఆరోపించింది.  ఘటన జరిగిన ప్రదేశం రాష్ట్ర పరిధిలోనే ఉంది కాబట్టి అది రాష్ట్రానికే సంబంధమని బీజేపీ వాదించింది.  

మెుత్తానికి ఈ ఘటనపై విచారణ నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. అయితే సిట్‌పై త‌న‌కు న‌మ్మ‌కం లేద‌ని కేంద్ర దర్యాప్తు సంస్థ‌తో విచార‌ణ జ‌రిపించాల‌ని హైకోర్టులో జ‌గ‌న్ పిటిష‌న్ వేశారు. ఇది ప్ర‌స్తుతం విచార‌ణ‌లో ఉంది.