అనంతపురం: మరికొద్ది గంటల్లోనే 2018వ సంవత్సరానికి గుడ్ బై చెప్తూ 2019కి వెల్ కమ్ చెప్పే సమయం ఆసన్నమైంది. ఏపీ రాజకీయాల్లో ఈ ఏడాది ఎవరికి కలిసొచ్చింది, ఎవరికి నష్టం తెచ్చిపెట్టింది అని చూస్తే ఓ వైసీపీ నేతకు మాత్రం కలిసొచ్చిందనే చెప్పాలి.  

2018 వ సంవత్సరం వైసీపీ నేతలకు కలిసొచ్చింది అంటున్నారు అదెలా అనుకుంటున్నారా....నిజంగానే ఆయనకు కలిసొచ్చింది. నక్క తోక తొక్కారో లేక ఏం చేశారో తెలియదు కానీ ఎమ్మెల్యే పదవి మాత్రం ఆయన తలుపు తట్టింది. అయితే ఎమ్మెల్యే పదవి దక్కడానికి ఆయన ఎంతో పోరాటం చేశారనుకోండి.

ఇక వివరాల్లోకి వెళ్లిపోదాం. అనంతపురం జిల్లా మడకశిర వైసీపీ నేత డా.తిప్పేస్వామిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాయి ఉన్నత న్యాయ స్థానాలు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున మడకశిర ఎమ్మెల్యేగా గెలుపొందిన ఈరన్న ఎన్నికల చెల్లదంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. 

హైకోర్టు తీర్పుతో కంగుతిన్న ఎమ్మెల్యే ఈరన్న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టు సైతం ఎన్నికల అఫిడవిట్ లో కొన్ని విషయాలు దాయడం నేరమని భావిస్తూ అతని ఎన్నికల చెల్లదని తిప్పేస్వామిని ఎమ్మెల్యేగా ప్రకటించాలని కోరుతూ ఆదేశాలు జారీ చేసింది. 

ఈ నేపథ్యంలో డిసెంబర్ 20న తిప్పేస్వామి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆయన చేత ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఇలా తిప్పేస్వామికి ఎమ్మెల్యే పదవి కలిసొచ్చింది. దీంతో ఓ ఎమ్మెల్యే వైసీపీకి కలిసిరాగా టీడీపీ బొక్కపడింది. 

ఇకపోతే ఈరన్న తన ఎన్నికల అఫిడవిట్ లో తన భార్య ప్రభుత్వ ఉద్యోగి అన్న విషయాన్ని పొందు పరచలేదు. అంతేకాదు తనపై ఉన్న మర్డర్ కేసులను కూడా పొందుపరచలేదు. దీంతో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారంటూ ఈరన్నపై తిప్పేస్వామి పోరాటం చేస్తున్నారు. ఎట్టకేలకు ఆయన పోరాటం ఫలించింది. ఈరన్న ఎన్నికను కోర్టు కొట్టేసింది. తిప్పేస్వామిని ఎమ్మెల్యేగా ప్రకటించింది. ఈ ఆసక్తికర పరిణామంపై తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రత్యేక చర్చ జరిపారు.