ఐదేళ్ల తేజ అనుమానాస్పద మృతి: పెందుర్తి పోలీస్ స్టేషన్ ముందు పేరేంట్స్ ఆందోళన
విశాఖపట్టణంలో ఐదేళ్ల బాలుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. ఈ బాలుడి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం డిమాండ్ చేసింది.
విశాఖపట్టణం: ఐదేళ్ల బాలుడు తేజ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన విశాఖపట్టణంలో చోటు చేసుకుంది. ఈ నెల 8వ తేదీన తేజ కన్పించకుండా పోయాడు. అయితే ఈ నెల 9వ తేదీన విశాఖపట్టణంలోని లారీ యార్డులో తేజ మృతదేహం లభ్యమైంది. తేజ మృతికి కారకులకు కఠినంగా శిక్షించాలని తేజ పేరేంట్స్, స్థానికులు మంగళవారంనాడు పెందుర్తి పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.
విశాఖపట్టణంలోని ఎస్ఆర్ పురం లోని ఓ స్విమ్మింగ్ పూల్ వద్ద కు వెళ్లిన తేజ ప్రమాదవశాత్తు పడిపోయాడు. అయితే స్విమ్మింగ్ పూల్ లో తేజ పడిపోయిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. అయితే స్విమ్మింగ్ పూల్ పడిన తేజ లారీ యార్డులో శవంగా ఎలా మారాడని బాధిత కుటుంబం ప్రశ్నిస్తుంది. తేజ ఎడమ చేయి ఉంగరం వేలుకు గాయాలను గుర్తించారు. పాము కాటు కారణంగానే తేజ మృతి చెందాడని ఈ గాయాలను చూపుతున్నారని బాధిత కుటుంబం ఆరోపిస్తుంది.
స్విమ్మింగ్ పూల్ నుండి లారీ యార్డుకు మధ్య ఏం జరిగిందో సీసీటీవీ పుటేజీని బయటపెట్టాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తుంది. బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పెందుర్తి పోలీసులు చెప్పారు. తేజ మృతదేహన్ని పోస్టుమార్టం కోసం పంపినట్టుగా పోలీసులు వివరించారు.