పశ్చిమగోదావరి జిల్లాలోని ఐదుగురు ఎంఎల్ఏలకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు దక్కేది అనుమానంగా ఉంది. వీరి వైకరిపై చంద్రబాబునాయుడు తీవ్ర అంసతృప్తిగా ఉన్నట్లు సమాచారం. పార్టీ కార్యక్రమాలు గానీ, ప్రభుత్వ కార్యక్రమాల అమలులో కానీ వీరు బాగా వెనకబడటమే సిఎం అసంతృప్తికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. దానికితోడు వీరి వ్యవహారశైలిపై నియోజకవర్గంలోని పార్టీ క్యాడర్లో పెరిగిపోయిన అసంతృప్తి, అంతర్గత కుమ్ములాటలతో జనాల్లో వీరిపై సదభిప్రాయం లేదని సిఎం నిర్వహించిన సర్వేల్లో స్పష్టమైందట.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 45 నియోజకవర్గాల్లోని ఎంఎల్ఏలు అన్నీ విధాలుగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు చంద్రబాబు ఆమధ్య పార్టీ సమావేశంలోనే ప్రకటించిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే, ఎంఎల్ఏల సంఖ్యను మాత్రమే చెప్పిన సిఎం వారెవరనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. దాంతో 45 మంది ఎంఎల్ఏలు ఎవరనే విషయంలో ఎవరికి వారుగా ఆరాతీస్తున్నారు. అయితే, 45 మంది ఎంఎల్ఏల్లో పశ్చిమగోదావరి జిల్లాలోనే 5 మంది ఉన్నారనే సమాచారం బయటకు పొక్కింది. దాంతో ఆ ఐదుగురు ఎవరు అన్న విషయంపై పార్టీలోను, జిల్లాలోనూ చర్చ మొదలైంది.

ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల అమల్లో మిగిలిన వారికన్నా 5 గురు ఎంఎల్ఏలు బాగా వెనకబడినట్లు సిఎం కార్యాలయం నుండి అందిన సమాచారం బట్టి తెలుస్తోంది. ఐదుగురి పేర్లు స్పష్టంగా తెలియకపోయినా జిల్లాలోని డెల్టా, మెట్ట ప్రాంతాలకు చెందిన ఎంఎల్ఏలుగా ప్రచారం జరుగుతోంది. వీరిపై అవినీతి ఆరోపణలు పెరిగిపోవటం, నియోజకవర్గాల్లో కుమ్ములాటలు తీవ్రస్ధాయికి చేరుకోవటం బాగా మైనస్ గా మారిందట. వీరి వైఖరిని మార్చుకోమని చంద్రబాబు చెప్పినా వినలేదట. అందుకే వచ్చే ఎన్నికల్లో ఆ ఐదుగురికి టిక్కెట్లు దక్కేది అనుమానమే అంటూ జిల్లాలో ప్రచారం జోరందుకున్నది.