అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తన కేబినెట్ లో ఐదుగురికి ఉపముఖ్యమంత్రి పదవులను కేటాయించారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీ వాణిని ఉప ముఖ్యమంత్రిగా నియమించారు. 

అలాగే ఆమెకు గిరిజన సంక్షేమ శాఖ కేటాయించారు. అలాగే బీసీల నుంచి శెట్టిబలిజ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కు ఉపముఖ్యమంత్రిగా అవకాశం కల్పించారు. అలాగే కీలకమైన రెవెన్యూ శాఖను కేటాయించారు. 

మరోవైపు కాపు సామాజిక వర్గం నుంచి ఆళ్ల నానికి డిప్యూటీ సీఎంగా అవకాశం కల్పించారు. అలాగే కేబినెట్ లో ఆయనకు వైద్య ఆరోగ్యశాఖను కేటాయించారు. ఇకపోతే ఎస్సీ సామాజిక వర్గం నుంచి కె. నారాయణ స్వామికి అవకాశం కల్పించారు. 

అలాగే కేబినెట్ లో ఎక్సైజ్ మరియు కమర్షియల్ ట్యాక్స్ శాఖ మంత్రిగా అవకాశం కల్పించారు. ముస్లిం సామాజిక వర్గం నుంచి అంజద్ భాషా షేక్ బీపారికి ఉపముఖ్యమంత్రిగా అవకాశం కల్పించారు. ఆయనకు ముస్లిం మైనార్టీ సంక్షేమ శాఖను కేటాయించారు. మెుత్తం ఆంధ్రప్రదేశ్ లో ఐదు సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించేలా ఉప ముఖ్యమంత్రి పదవులను ఎంపిక చేశారు వైయస్ జగన్.