వెలగపూడికి ప్రభుత్వం కంటే అవినీతే ముందొచ్చిందా... నిప్పుకి తుప్పు పడుతున్నదా !
దేశంలో మీరెక్కడికయినా వెళ్లండి మీకంటే ముందక్కడికి అవినీతి చేరుకుంటంది. కొత్త రెండువేల నోట్లొచ్చాయో లేదా నకిలీ నోట్ల హల్ చల్ చేస్తున్నాయి.
అవెంత చూడముచ్చటగా ఉన్నాయంటే, బ్యాంకు అధికారుల చేతుల్లో నుంచే రాజాగా కౌంటర్లనుంచి బయటకొస్తున్నట్లు చెబుతున్నారు. విషయమేమిటంటే, వెలగపూడి లోకి ప్రభుత్వమింకా పూర్తిగా మారనేలేదు, అక్కడకి అవినీతి ముందేవెళ్లిపోయి తిష్టవేసిందని ని చాలా రోజులుగా వినబడుతూంది. నిప్పులాంటి మనిషున్నా అవినీతి అక్కడ తిష్టవే సిందంటే అర్థమేమిటి? నిప్పుకి తుప్పు పడుతున్నదా?
అయిష్టంగా హైదరాబాదొదిలి, వెలగపూడి వెళ్లి ఉద్యోగులు అక్కడి అదనపు ఖర్చులు రాబట్టకునేందుకు పనుల మీద విజయవాడ లేదా కొత్త సచివాలయం వచ్చే వాళ్ల దగ్గిర నుంచి ‘వెలగపూడి సెస్’వసూలు చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. అయితే, ఇపుడు అక్కడ అవినీతి ఎలా తాండవిస్తున్నదో బయటపడింది.
ఈ రోజు అవినీతి నిరోధక శాఖ అధికారులు వల పన్ని అవినీతి చేపనొకదాన్ని పట్టుకున్నారు. హోం శాఖ సెక్షన్ ఆఫీసర్ శ్రీనాధ్ ఒక వ్యక్తి దగ్గిర నుంచి రు. 50 వేలు వసూలు చేస్తుండగాపట్టుకున్నారు. ఇవన్నీ పాత అయిదొందల నోట్లని చెబుతున్నారు. అంటే లంచానికి పాత అయిదొందల నోట్టు చెల్లుతున్నాయనేనా అర్థం.
కొత్త రాజధాని మొట్టమొదటి ఎసిబి ట్రాపింగ్ గా ఈ చరిత్రలో నిలిచిపోతుంది. అంతేకాదు, వెలగపూడి సెక్రేటేరియట్ హైసెక్యూరిటీ జోన్ అని ప్రకటించి ప్రజలెవరూ రాకుండా అడ్డుకోవచ్చు గాని, అవినీతిని అడ్డుకోగలరా?
