తిరుమల ఎక్స్ ప్రెస్ లో బాణాసంచా పేలుడు...ప్రయాణికులు ఏం చేశారంటే...
రైలు భోగీలోని టాయిలెట్ దగ్గర ఉన్న ఓ సంచిలో నుంచి పొగలు వచ్చాయి. ఇది చూసిన ప్రయాణికులు భయభ్రాంతులతో రైలులో నుంచి దూకేందుకు ప్రయత్నించారు.

విశాఖపట్నం : తిరుమల ఎక్స్ప్రెస్ రైలులో బాణాసంచా పేలుడు కలకలం రేపింది. తిరుమల ఎక్స్ప్రెస్ విశాఖపట్నం నుంచి తిరుపతికి వెళుతోంది. ప్రయాణికుడి దగ్గర ఓ సంచిలో ఉన్న బాణాసంచా ప్రమాదవశాత్తు అంటుకొని పేలింది. దీంతో భోగి మొత్తం పొగలు వ్యాపించాయి. ప్రయాణికులు తీవ్రభయాందోళనలకు గురయ్యారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరిన తిరుమల ఎక్స్ప్రెస్ తుని స్టేషన్కు చేరుకుంది.
తుని స్టేషన్ నుంచి తిరిగి రైలు బయలుదేరుతున్న సమయంలో ఓ భోగిలో పొగలు కనిపించాయి. ఆ భోగీలో ఉన్న టాయిలెట్ దగ్గర ఉన్న ఓ సంచిలో నుంచి ఆ పొగలు వస్తున్నాయి. ఇది చూసిన ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. రైలులో నుంచి దూకేందుకు ప్రయత్నించారు. మరికొందరు చెయిన్ లాగడంతో రైలు ఆగింది. వెంటనే కొంతమంది ప్రయాణికులు సమయస్ఫూర్తితో వ్యవహరించారు.
విజయవాడ బస్సు భీభత్సం... ఎంత భయానకంగా జరిగిందో చూడండి.. (వీడియో)
బాణాసంచా ఉన్న సంచిని కాళ్లతో తొక్కి రైలులో నుంచి బయటికి తోసేశారు. రైలులో అప్పటికే ఓచోట పొగ వస్తుండడంతో అక్కడ కూడా కాళ్లతో తొక్కి దాన్ని ఆర్పేశారు. ఆర్ పిఎఫ్, రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన సదరు భోగి దగ్గరికి చేరుకున్న రైల్వే సిబ్బంది, ఆర్పిఎఫ్ భోగిని క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రమాదమేమీ లేదని తేల్చిన తర్వాత రైలు బయలుదేరింది.
రైలులో నుంచి ప్రయాణికులు తోసేసిన బాణాసంచా బ్యాగును… జి ఆర్పి సిబ్బంది స్వాధీనం చేసుకుంది. అందులో చిన్న చిచ్చుబుడ్డిలు ఉన్నట్టుగా గుర్తించారు. ఆ సంచిలో బాణాసంచాతో పాటు. మందులు కూడా ఉన్నాయని.. ఆ సంచి ఎవరిదో ఇంకా గుర్తించలేదని తెలిపారు.