అమరావతి: విజయవాడ స్వర్ణ ప్యాలెస్  కోవిడ్ సెంటర్లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని కారణంగానే అగ్ని ప్రమాదం చోటు చేసుకొందని అగ్ని మాపక సిబ్బంది గుర్తించారు. 

ఇవాళ ఉదయం ఐదు గంటల సమయంలో విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది.ఈ ప్రమాదంలో  మృతుల సంఖ్య 11కి చేరుకొంది.  మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. 

రమేష్ ఆసుపత్రి యాజమాన్యం విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ ను కోవిడ్ సెంటర్ ను మార్చుకొంది. ఈ ఆసుపత్రిలో30 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు.

మంటలను ఆర్పిన తర్వాత స్వర్ణా ప్యాలెస్ ను పరిశీలించారు అగ్ని మాపక సిబ్బంది.  షార్ట్ సర్క్యూట్ కారణంగా  విద్యుత్ వైర్లలో మంటలు వ్యాపించినట్టుగా ఫైర్ సిబ్బంది అనుమానిస్తున్నారు. మరో వైపు స్విచ్ బోర్డులపై కూడ శానిటైజర్ ను సిబ్బంది చల్లినట్టుగా  గుర్తించారు. దీంతో మంటల తీవ్రత మరింతగా పెరిగిందని అగ్ని మాపక సిబ్బంది అభిప్రాయపడుతున్నారు.

ఈ హోటల్ లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించలేదని గుర్తించారు. ఈ మేరకు నివేదికను ఫైర్ సేఫ్టీ సిబ్బంది తయారు చేస్తున్నారు. ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించనున్నారు. ప్రమాదం జరిగిన హోటల్ ను డీజీపీ సవాంగ్ పరిశీలించారు. ఘటనపై సీపీ నుండి డీజీపీ వివరాలను సేకరించారు.