Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో పేలిన బుల్లెట్ బండి.. పూజ కోసం ఆలయం బయట పార్క్ చేయగానే రాయల్ ఎన్‌ఫీల్డ్‌లో మంటలు.. (వైరల్ వీడియో)

ఆంధ్రప్రదేశ్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బండి పేలింది. మైసూరు నుంచి నాన్ స్టాప్‌గా అనంతపురం జిల్లా గుంతకల్లుకు నడుపుకుంటూ వచ్చిన రవిచంద్రన్ అనే వ్యక్తి ఉగాది సందర్భంగా దానికి పూజ చేయించాలని అనుకున్నారు. కసాపురంలోని ఆంజనేయ ఆలయం ఎదుట పార్క్ చేశారు. అప్పుడే ఆ బుల్లెట్ బండిలో మంటలు వచ్చాయి. స్వల్ప కాలంలోనే పెట్రోల్ ట్యాంక్ పేలిపోయింది. 

fire engulfed in royal enfield bike in andhra pradesh
Author
Amaravati, First Published Apr 4, 2022, 7:30 PM IST

అమరావతి: బుల్లెట్ బండికి ఇప్పుడు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ బండిపై ఏకంగా ఫోక్ సాంగ్ వచ్చింది. అది సూపర్ హిట్. చాలా మందికి డ్రీమ్ బైక్ కూడా ఇది. అదే ఆశలతో ఓ వ్యక్తి రాయల్ ఎన్‌ఫీల్డ్ కొనుగోలు చేశాడు. ఉగాది రోజే ఆ బండిని పూజ చేయించాలనుకున్నాడు. మైసూరు నుంచి నేరుగా ఏపీలోని అనంతపురం జిల్లాకు బుల్లెట్ బండిపై వచ్చాడు. వచ్చీ రాగానే గుంతకల్లు మండలం కసాపురంలోని ఆంజనేయ స్వామి ఆలయం ఎదుట ఆపాడు. అక్కడే బండి పూజ చేయించాలని అనుకున్నాడు. కానీ, అంతలోనే ఆ బుల్లెట్ బండిలో మంటలు వ్యాపించాయి. అవి మరింత ఉధృతంగా మారాయి. దాదాపు ఒక బాంబు పేలినట్టుగానే భారీగా పెట్రోల్ ట్యాంక్ వద్ద మంటలు వచ్చాయి. ఈ ఘటనకు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

రవిచంద్రన్ అనే వ్యక్తి ఇటీవలే రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ కొన్నాడు. దాన్ని మైసూరు నుంచి సుమారు 387 కిలోమీటర్లు నాన్ స్టాప్‌గా నడుపుకుంటూ అనంతపురం జిల్లాలోని కసాపురానికి తీసుకువచ్చాడు. ఉగాది రోజున కసాపురంలోని ఆంజనేయ స్వామి ఆలయం ఎదుట పార్క్ చేశాడు. బండి పూజ గురించి ఆలయ పురోహితులకు చెప్పారు. వారు కూడా బండి పూజ చేయడానికి రెడీ అయ్యారు. కానీ, రవిచంద్రన్ ఆలయంలోని వెళ్లీ వెళ్లగానే ఆ బండి పెట్రోల్ ట్యాంక్ వద్ద చిన్నగా మంటలు మొదలయ్యాయి. స్వల్ప కాలంలోనే అవి భారీగా ఎగసిపడ్డాయి. అనంతరం ఒక్కసారిగా ఆ పెట్రోల ట్యాంక్ పేలింది. దీంతో కొన్ని మీటర్ల మేర మంటలు ఎగసిపడ్డాయి. దీంతో రవిచంద్రన్ తీవ్ర నిరాశలో కూరుకుపోయారు.

ఆలయ యజమానులు ఈ ముప్పును గ్రహించారు. వెంటనే నీరు చల్లి మంటలను ఆర్పేసే ప్రయత్నాలు చేశారు. తర్వాత ఆ మంటలు అదుపులోకి వచ్చాయి. కానీ, ఆపాటికే భారీగా మంటలు రావడంతో ఆ రాయల్ ఎన్‌ఫీల్డ్ పాక్షికంగా కాలిపోయింది. ముఖ్యంగా పెట్రోల్ ట్యాంక్ భాగంలో బైక్ డ్యామేజీ అయింది. స్థానికులు ఆ ఘటనను వీడియో తీశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

తమిళనాడులో గత నెల చివరలో ఘోరం జరిగింది. ఎలక్ట్రిక్‌ బైకు పేలి తండ్రీకూతుళ్లు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘ‌ట‌న వేలూరులోని ఓల్డ్ టౌన్ సమీపంలోని చిన్న అల్లాపురంలో చోటు చేసుకుంది. ఘటనలో బైక్‌ ఓనర్‌ దురైవర్మ(49)తో పాటు ఆయన కూతురు మోహన ప్రీతి(13) దుర్మరణం పాలయ్యారు.  

 పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. అల్లాపురంలోని టోల్‌గేట్ సమీపంలో  ఎం.దురైవర్మ(49)  చాలా ఏళ్లుగా ఫోటో స్టూడియో నిర్వహిస్తూ.. జీవ‌నం సాగిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఆయ‌న కొత్త  ఈ-బైక్‌ను కొనుగోలు చేశారు. రోజువారి లాగానే.. శుక్రవారం రాత్రి ఇంట్లోనే బైక్‌ను ఛార్జింగ్‌ పెట్టారు.  అయితే విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా ఈ-బైక్‌లో మంటలు చెలరేగాయి. ఆ వెంట‌నే దట్టమైన పొగలు అలుముకున్నాయి. మంటల్ని ఆర్పేందుకు వర్మ, ప్రీతి  నీళ్లు గుమ్మరించే ప్రయత్నం చేయబోయారు. అయితే పొగకు ఉక్కిరి బిక్కిరి అయ్యి.. అక్కడికక్కడే మృతి చెందారు  తండ్రీకూతుళ్లు. 

Follow Us:
Download App:
  • android
  • ios