విశాఖపట్నంలో తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. అచ్యుతాపురంలో అక్రమంగా నిల్వచేసిన గ్యాస్ సిలిండర్ల గోడౌన్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్ లీకవ్వడం వల్లే ఈ  ప్రమాదం జరిగి ఉండొచ్చని సమాచారం.  సరైన సమయంలో అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తేవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. 

చాలా రోజులనుండి ఇక్కడ పెద్ద ఎత్తున అక్రమ గ్యాస్ ఫిల్లింగ్ జరిగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు  ఆరోపిస్తున్నారు. భారీ మొత్తంలో గ్యాస్ సిలండర్లు నిల్వచెయ్యడంతో భయ బ్రాంతులకు గురైనట్లు... ఈ విషయంపై పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మండిపడుతున్నారు. ఆయా శాఖలకు నెల నెలా మామూళ్లు అందుతున్నాయి కాబట్టే చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. 

 ఈ సంఘటనపై విచారణ చేస్తే భారీ గ్యాస్ మాఫియా బయట వస్తుందని స్థానికులు  చెబుతున్నారు. ఇదొక్కటే కాకుండా ఇలాంటి అక్రమ నిల్వ కేంద్రాలు అచ్యుతాపురంలో ఇంకా చాలా ఉన్నట్లు చెబుతున్నారు. 

సెజ్ లో పనిచేసే దినసరి కార్మికులకు అక్రమంగా ఫిల్లింగ్ చేసిన గ్యాస్ సిలిండర్లు అమ్ముకుని అనేక ముఠాలు సొమ్ము చేసుకుంటున్నాయట. జనావాసాల మధ్య ఇలాంటి అక్రమ గ్యాస్ నిల్వకేంద్రాలు ఏర్పాటు చేయడంతో బిక్కు బిక్కు మంటూ జీవిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.