శ్రీకాకుళం: మరికొద్ది రోజుల్లో కూతురు పెళ్లి. ఎలాంటి లోటు లేకుండా అంగరంగ వైభవంగా తమ బిడ్డకు పెళ్లిచేయాలని ఆ తల్లిదండ్రులు భావించారు. తమకు భారమైనా లక్షల్లో నగదును, బంగారాన్ని సమకూర్చుకున్నారు. అయితే ప్రమాదవశాత్తు వారి ఇళ్లు అగ్నిప్రమాదానికి గురవడంతో ఆ నగదు, బంగారం కూడా కాలిబూడిదయ్యాయి. దీంతో శుభకార్యం జరగాల్సిన ఇంట్లో విషాదం నెలకొంది. 

ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం హంస కాలనీలో చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా సోమవారం కాలనీలో అగ్ని ప్రమాదం సంభవించింది.ఇందులో వారాడ కృష్ణమూర్తి, బొడ్డు గోపాల్‌కు చెందిన ఇండ్లు కాలిపోయాయి. అయితే మరికొద్దిరోజుల్లో కూతురు పెళ్లి వుండటంతో కృష్ణమూర్తి రూ. 9.20 లక్షల నగదు, ఏడు తులాల బంగారం ఆభరణాలను ఇంట్లో వుంచాడు. ఈ అగ్నిప్రమాదంలో డబ్బుతో పాటు బంగారం కాలిబూడిదయ్యాయి. 

కేవలం డబ్బు, బంగారమే కాదు ఇంట్లోని విలువైన సామాగ్రి కూడా అగ్గికి ఆహుతయ్యిందంటూ ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇళ్లు కూడా పూర్తిగా దగ్దమవడంతో తాము రోడ్డున పడ్డామని ఆ కుటుంబం బాధపడుతోంది.