చిత్తూరు: చిత్తూరు జిల్లా కందూరులో జనసేన పార్టీ నిర్వహించిన బహిరంగ సభ రసాభాసగా మారింది. సభలో జబర్దస్త్ ఫేం హైపర్ ఆది ప్రసంగిస్తున్న సమయంలో పలువురు వైసీపీ నేతలు సభలోకి దూసుకువచ్చారు. జై జగన్, జోహార్ వైఎస్ ఆర్ అంటూ నినాదాలు చేశారు. 

దీంతో వైసీపీ కార్యకర్తలపై జనసేన కార్యకర్తలు తిరగబడ్డారు. సభ నుంచి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు. సభలో గలాట జరుగుతున్న సమయంలో హైపర్ ఆది కీలక వ్యాఖ్యలు చేశారు. 

జనసేన గుర్తు గాజు గ్లాసు అని అది కిందపడితే పగిలపోద్ది కానీ ఎదురు తిరిగితే దిమ్మ తిరిగిపోద్ది అంటూ వార్నింగ్ ఇచ్చారు. జనసైన్యం దాడులకు భయపడదని దెబ్బదెబ్బకి రాటు దేలుతుందని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ ఎవరితోపొత్తులు పెట్టుకున్నా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ప్రజలతో పొత్తు పెట్టుకున్నారని చెప్పుకొచ్చారు. 

ఆయనను ఎవరూ ఓడించలేదరన్నారు. యుద్ధంలో దెబ్బ పడేకొద్ది బలహీన పడటానికి ఇది రాజుల సైన్యం కాదని జనసైన్యం అంటూ ప్రసంగించారు. రాబోయే నాలుగు నెలల్లో ఇలాంటి దాడులు ఉంటాయని అయినా వెనకడుగు వెయ్యబోమన్నారు. 

రాజకీయాలు గురించి మాట్లాడాలంటే అనుభవం ఉండాలంటున్న వ్యాఖ్యలను హైపర్ ఆది ఖండించారు. అనుభం అవసరమే కానీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వ్యక్తి గురించి తెలుసుకుంటే సరిపోతుందని అనుభవం అవసరం లేదన్నారు. 

గతం గురించి తెలుసుకోవడంలో తప్పులేదన్నారు. కార్యకర్తలు మంచోళ్లేనని అయితే నాయకులు మంచోళ్లో కాదో చూసుకోవాలన్నారు. కార్యకర్తల కోసం ప్రాణాలిచ్చే నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక్క  పవన్ కళ్యాణ్ మాత్రమేనని ఆయన్ను రాబోయే ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. హైపర్ ఆది వ్యాఖ్యలతో వైసీపీ నేతలు మరింత రెచ్చిపోయారు. హైపర్ ఆది కారుపై దాడికి దిగారు. దీంతో ఆది కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి.