అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో తెలుగుదేశం పార్టీలో టిక్కెట్ల కోసం పోటీ పడుతున్న ఆశావహులు అధినేతతో తేల్చుకునేందుకు రెడీ అవుతున్నారు. ముఖ్యంగా దశాబ్ధాల వైరంతో, ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్న నేతలు ఒకే నియోజకవర్గం కోసం అమీతుమీకి సిద్ధమవుతున్నారు.

వీటిలో కడప జిల్లా జమ్మల మడుగు నియోజకవర్గంపైనే ఇప్పుడు అందరి చూపు నెలకొంది. ఫ్యాక్షన్ రాజకీయాలకు అడ్డాగా ఉన్న జమ్మలమడుగులో రెండు కుటుంబాలదే ఆధిపత్యం. వాటిలో ఒకటి పొన్నపురెడ్డి, రెండవది దేవగుడి కుటుంబం.

ఈ రెండు కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత శతృత్వం ఉంది. అయితే మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు రెండు గ్రూపులు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన ఆదినారాయణ రెడ్డి తర్వాత టీడీపీలో చేరి, మంత్రయ్యారు.

ఆయన మరోసారి ఇక్కడి నుంచే పోటీ చేయాలని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆదినారాయణరెడ్డి చేతిలో ఓడిపోయి ఎమ్మెల్సీగా ఉన్న రామసుబ్బారెడ్డి అసెంబ్లీ సీటు కావాల్సిందేనని పట్టుబట్టారు. అసెంబ్లీకి పోటీ చేయకపోతే ఏళ్లుగా తమ కుటుంబాన్ని నమ్ముకున్న కార్యకర్తలు ఇబ్బందిపడతారని రామసుబ్బారెడ్డి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.

ఆదినారాయణ రెడ్డిని కడప పార్లమెంటు బరిలో దించుతారని ప్రచారం జరుగుతుండటంతో తాను అసెంబ్లీకే పోటీ చేస్తానని ఆది చెప్పడంతో టీడీపీ అధినేత ఎటూ తేల్చుకోలేకపోయారు. నిన్న అమరావతిలో ఇద్దరి నేతలతో అర్థరాత్రి వరకు చర్చలు జరిపిన ఆయన తన నిర్ణయాన్ని అతి త్వరలో ప్రకటిస్తానని తెలిపారు.